
తాగుడు మానేయాలంటూ భర్తపై దాడి
ఉరవకొండ రూరల్: పదేపదే ప్రాధేయపడిన తాగుడు మానేయకపోవడంతో అసహనానికి లోనైన వివాహిత తన భర్తపై కట్టెతో దాడి చేసింది. వివరాలు.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఓబులేసు, ఉలిగమ్మ దంపతులు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసై కూలి పనులు చేయకుండా నిత్యమూ మద్యం మత్తులో జోగేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాగుడు మానాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా ఓబులేసులో మార్పు రాలేదు. గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఓబులేసును మరోసారి భార్య మందలించింది. తాగుడు మానేసి బుద్ధిగా తనతో పాటు కూలి పనులకు రావాలని హితవు పలికింది. ఆమె మాటలతో ఏకీభవించని ఓబులేసు వాగ్వాదానికి దిగాడు. దీంతో అసహనానికి గురైన ఉలిగమ్మ చేతికి అందుబాటులో ఉన్న కట్టె తీసుకుని భర్తపై దాడి చేసింది. అనంతరం స్థానికులతో కలసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పిచ్చికుక్క దాడిలో
10 మందికి గాయాలు
బెళుగుప్ప: మండల కేంద్రంలోని పలు కాలనీల్లో గురువారం పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. వినాయక నగర్, దళిత వాడ, కమ్మర వీధిలో తిరుగుతూ 10 మందిని గాయ పరిచింది. కూలి పనులతో జీవనం సాగిస్తున్న అంజినమ్మ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు స్థానిక పీహెచ్‌సీలో చికిత్స అందజేశారు. సుశీలమ్మను అనంతపురానికి రెఫర్ చేశారు.
రాష్ట్ర స్థాయి ఉత్తమ
అధ్యాపకురాలుగా కవిత
శింగనమల: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.జి.కవిత.. రాష్ట్ర స్థాయి ఉత్తమ అద్యాపకురాలుగా ఎంపికయ్యారు. చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురంలోని కేఎస్‌ఆర్, పామిడి, గుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్‌గా ఆమె పని చేశారు. ఇంటర్ పరీక్ష ఫలితాల్లో 94 శాతం ఉత్తీర్ణతను సాధించినందుకు గాను అవార్డుకు ఎంపిక చేసినట్లుగా సమాచారం.

తాగుడు మానేయాలంటూ భర్తపై దాడి