
పాలన చేతకాకపోతే తప్పుకోండి
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జన జీవనం అస్థవ్యస్థంగా మారిందని, పాలన చేతకానప్పుడు తప్పుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. గురువారం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.యూరియా కొరతతో రైతులు రోజంతా బారులు తీరుతున్నా.. ఒక్క బస్తా కూడా అందించలేని అసహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ‘అంతు చూస్తాం... తప్పుడు వార్తల సృష్టి’ అంటూ ఎదురు దాడి చేస్తూ కేసులు బనాయిస్తున్నారని మండి పడ్డారు. శింగనమల నియోజకవర్గంలో ఏడాది అవుతున్నా పంట సాగుకు చుక్క నీరు కూడా వదల్లేదని, పాలనలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రైతు సమస్యలపై ఈ నెల 9న అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తలపెట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ భాస్కర్, 6 మండలాల కన్వీనర్లు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పూల ప్రసాద్, ఖాదర్‌వలి, యల్లారెడ్డి, శంకర్, నాగలింగారెడ్డి, ముసలన్న, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, లలితాకళ్యాణి, లక్ష్మీరెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ధ్వజం
రైతు పోరుకు సిద్దం కావాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపు