
గుంతకల్లులో ఫీవర్ సర్వే
గుంతకల్లు టౌన్: పట్టణంలో విజృంభిస్తున్న విషజ్వరాలపై ‘గుంతకల్లుకు జ్వరమొచ్చింది’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జిల్లా వైద్యాధికారులు స్పందించారు. జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు గురువారం యూపీహెచ్‌సీ, గుత్తి మలేరియా సబ్‌యూనిట్ సిబ్బందితో కలసి ఎస్‌ఎన్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ సజీవ్‌కుమార్ సోఫియాస్ట్రీట్‌లో పర్యటించి ఫీవర్ సర్వే చేపట్టారు. జ్వరం, దగ్గు, జలుబు తదితర కారణాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు. కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలకు మలేరియా, డెంగీ, చికూన్‌గున్యా, టైఫాయిడ్ జ్వరాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలుంటే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకుని మెరుగైన వైద్యసేవలు పొందాలన్నారు. సూపర్‌వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, నారాయణస్వామి, ఏఎన్‌ఎం మంజుల, ఆశా వర్కర్ వాణి పాల్గొన్నారు. కాగా, పట్టణంలోని అన్ని వార్డుల్లో జ్వరపీడితులు అత్యధికంగా ఉంటే కేవలం సోఫియా స్ట్రీట్‌లో మాత్రమే మెడికల్ క్యాంప్, ఫీవర్ సర్వే నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది.

గుంతకల్లులో ఫీవర్ సర్వే