
కన్నేసి కాటేస్తూ..
అనంతపురం: ఆడబిడ్డలకు భద్రత కొరవడింది. బడిలో, బస్సులో, ఇంటా, బయట ఇలా ఎక్కడ చూసినా కాచుకుని కన్నేస్తున్న మృగాళ్లు ఒక్కసారిగా కాటేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడబిడ్డ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు. గత పది నెలల్లో చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 12 నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బయటకు చెబితే పరువు పోతుందనే భయంతో చాలామంది తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు. చాలా తక్కువ ఘటనలే పోలీస్‌స్టేషన్ల వరకు వెళ్తున్నాయి.
బరి తెగిస్తున్న ‘పచ్చ’ నాయకులు
కూటమి ప్రభుత్వంలో అకృత్యాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. తామేం చేసినా చెల్లుబాటవుతుందనే అహంకారంతో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. ఇటీవలే కణే కల్లు మండలం యర్రగుంట గ్రామంలో ఓ ‘పచ్చ’ నేత 8వ తరగతి చదివే బాలికను మానసికంగా, శారీరకంగా హింసించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. అదృష్టవశాత్తూ తల్లిదండ్రులు అప్రమ్తతమై కుమార్తెను కాపాడుకున్నారు. వివాహితుడైనప్పటికీ, వావివరసలు మరచి బాలికను వేధించిన తీరు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేసింది.
మచ్చుకు కొన్ని ఘటనలిలా..
పుట్లూరు మండలంలో ఓ గ్రామానికి చెందిన రవితేజ అదే గ్రామానికి చెందిన బాలికను తాడిపత్రి మార్కెట్ యార్డు సమీపంలో నిలిపి ఉన్న ఐచర్ వాహనంలోకి బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించి అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు రవితేజపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
● మూడు నెలల క్రితం నార్పల మండల కేంద్రంలో ఓ బాలికపై మహేష్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన మహేష్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
చట్టం ఉన్నా..
బాలికలు, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడితే పోక్సో కేసు నమోదు చేస్తారని తెలిసినా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి కేసుల్లో జీవిత ఖైదు, లేదా 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయినా లైంగిక దాడులు ఆగకపోవడం మృగాళ్ల బరితెగింపునకు అద్దం పడుతోంది. నేటి స్మార్ట్ యుగంలో చిన్న పిల్లలకు సైతం స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండంతో పిల్లలు చెడుమార్గం పట్టే అవకావం ఉందని సైకాలజిస్టులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారనే విషయాలతో పాటు వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలంటున్నారు.
కూటమి ప్రభుత్వంలో
బాలికలపై పెరిగిన అకృత్యాలు
ఆడబిడ్డ ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రుల్లో ఆందోళన
అధికార మదంతో
‘పచ్చ’ నేతల దురాగతాలు
చట్టమున్నా రెచ్చిపోతున్న వైనం