
గుమ్మనూరు క్షమాపణ చెప్పాల్సిందే
● రైతుల పక్షాన పోరాడితే
చంపుతామంటారా?
● రైతు సంఘాల నాయకుల మండిపాటు
అనంతపురం అర్బన్: రైతుల తరఫున పోరాడితే చంపుతామంటారా అంటూ రైతు, కార్మిక, రైతు కూలీ, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నించారు. తమ సంఘం నాయకులపై నోరుపారేసుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో విలేకరులతో రైతు, రైతు కూలీ, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు చిరుతల మల్లికార్జున, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, నాగరాజు, నాగేంద్రకుమార్, కృష్ణమూర్తి మాట్లాడారు. గుత్తి, పామిడి మండలాల్లో సోలార్ ప్రాజెక్టుకు జరుగుతున్న భూసేకరణను పరిశీలించేందుకు వెళ్లిన రైతు సంఘం నాయకులను ఎమ్మెల్యే జయరామ్ అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ‘అరగంటలో వెళ్లకపోతే చంపుతాం, తరిమికొడతాం’ అంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగారన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేవారెవరూ లేరన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోని బేతాపల్లిలో ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా రైతులను మభ్యపెట్టి, బెదిరింపులకు దిగి కంపెనీకి భూములు ఇచ్చేలా చేస్తున్నారన్నారు. కంపెనీ యాజమాన్యంతో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నాయకులు నేడు ఎడారిగా మార్చేందుకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. రైతుల కోసం వెనకడుగు వేసేది లేదని, ఎంతవరకై నా పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. సంఘాల నాయకులు, శివారెడ్డి, నాగమణి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.