
విషాదం నింపిన వినాయక నిమజ్జనం
ఉరవకొండ (విడపనకల్లు): ఆ బాలుడు ఎంతో ఇష్టంగా బుల్లి మట్టి వినాయకుడిని తయారుచేశాడు. నిత్యం పూలు పెట్టి పూజలు చేశాడు. వినాయకుడిని గంగమ్మ ఒడికి చేర్చి వీడ్కోలు పలుకుదామని ఉత్సాహంగా వెళ్లిన అతడిని మృత్యువు మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడిని దూరం చేసి తల్లిదండ్రులకు తీరని శోకం నింపింది. వివరాలు.. విడపనకల్లు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రామాంజినేయులు, రేణుక దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు 3వ తరగతి చదువుతున్న కుమారుడు వరుణ్ (8) ఉన్నాడు. తాను మట్టితో తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయాలని బుధవారం ముగ్గురు స్నేహితులతో కలిసి కాలనీ సమీపంలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) 6వ డిస్ట్రిబ్యూటరీ వద్దకు వరుణ్ వెళ్లాడు. గణేశుడి ప్రతిమను నీటిలోకి వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడ్డాడు. గమనించిన స్నేహితులు పరుగున వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులకు చెప్పారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు నీళ్లలో కొట్టుకుపోతున్న వరుణ్‌ను బయటకు తీసి ఉరవ కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వరుణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే మృత్యు ఒడికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.