దివంగత నేత వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజలు ఆయనకు ఘన నివాళులర్పించారు. మంగళవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. మహానేతను మనసారా స్మరించారు. ఆయన అందించిన సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటారు. పేదల పెన్నిధి వైఎస్సార్ అంటూ కొనియాడారు.
అనంతపురం జెడ్పీలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించిన దృశ్యం
అనంతపురం కార్పొరేషన్: స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంస్కరణలకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారన్నారు. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకురావడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, 104, 108 తదితర పథకాలతో పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దార్శనికుడు వైఎస్సార్ అని కొనియాడారు. అనంతరం జెడ్పీ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
● కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్యర్యంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ వైఎస్సార్‌ను ప్రజలు మరువరన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, మండల కన్వీనర్లు సుధీర్, గోళ్ల సూరి, ఎంపీపీ మారుతమ్మ పాల్గొన్నారు.
● రాయదుర్గంలోని శాంతినగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప నివాళులర్పించారు. సంక్షేమ ప్రదాత వైఎస్సార్ అని కొనియాడారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్డు పంపిణీ చేశారు.
● డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సువర్ణ అధ్యాయమని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, ఐడీసీ మాజీ చైర్మన్ బుక్కచెర్ల నల్లప రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కురుబ నాగిరెడ్డి అన్నారు. రాప్తాడులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.
● గుంతకల్లులో వైఎస్సార్ విగ్రహం వద్ద మున్సిపల్ చైర్‌పర్సన్ భవాని, వైస్ చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళులర్పించారు. గుత్తి, పామిడిలో మాజీ సర్పంచ్ హుస్సేన్ పీరా, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌కుమార్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.
● తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్‌లో, మండ లంలోని సజ్జలదిన్నె పార్క్‌లో వైఎస్సార్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ శ్రేణులు నివాళులర్పించాయి. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి, జిల్లా నేత ఫయాజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
● శింగనమల నియోజకవర్గంలోని అన్ని మండ లాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేతలు వీరాంజనేయులు, నార్పల సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు
వైఎస్సార్‌కు ఘన నివాళులర్పించిన ప్రజలు
సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
జనం గుండెల్లో నిలిచిన నేత వైఎస్సార్:
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
‘జలయజ్ఞం’ ద్వారా ఎన్నో తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతాంగానికి వైఎస్సార్ వెన్నుదన్నుగా నిలిచారని వైఎస్సార్ సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి కొనియాడారు. ఉరవకొండలో వైఎస్సార్ విగ్రహానికి ఆయన ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి వైఎస్సార్ పెద్ద పీట వేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, సర్పంచ్ లలితమ్మ పాల్గొన్నారు.
రైతాంగానికి వెన్నుదన్ను
రైతాంగానికి వెన్నుదన్ను