
యూరియా కోసం ఎదురుచూపే
అనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వరి, మొక్క జొన్న, అరటితో పాటు వేరుశనగ, కంది, ఆముదం రైతులకు యూరియా అవసరం ఏర్పడింది. అధికారులేమో అనవసరంగా యూరియా వాడొద్దని సూచనలు చేస్తున్నారు. మోతాదుకు మించి వాడటం వల్ల పంట దిగుబడులు తగ్గిపోతాయని చెబుతున్నారు. యూరియా కొరత ఏర్పడటంతో రైతుల దృష్టి మళ్లించడానికి అధికారులు ఈ రకమైన సలహాలు ఇస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటల వారీగా ఎంత యూరియా వాడాలనే దానిపై కరపత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమానికి తెరతీశారు. ఇన్నేళ్లలో ఎపుడూ యూరియా వాడకంపై అవగాహన కల్పించని జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తుండటంపై రైతులు విస్తుపోతున్నారు. ఈ ఖరీఫ్‌లో అన్ని రకాల ఎరువులు 1.08 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో యూరియా టార్గెట్ 26,839 మెట్రిక్ టన్నులు. మిగతావి డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్, సూపర్ ఎరువులు ఉన్నాయి. కంపెనీల వారీగా, నెల వారీగా సరఫరా టార్గెట్లు విధించారు.
అందుబాటులో 31,266 మెట్రిక్ టన్నులు
ఈ సీజన్‌లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా ప్రణాళిక అమలు చేస్తున్నారు. అలాగే గత ఖరీఫ్, రబీకి సంబంధించి మిగులు 15,241 మెట్రిక్ టన్నులు ఉండటం ఈసారి కొంత వరకు కలిసొచ్చిన అంశం. అది లేకుండా ఉండి ఉంటే ఈపాటికి జిల్లాలో యూరియా సమస్య తీవ్రస్థాయిలో ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మిగులుతో పాటు ఈ ఖరీఫ్ ప్రణాళికలో ఇప్పటి వరకు 16,025 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 31,266 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టామని చెబుతున్నారు. సెప్టెంబర్ నెల టార్గెట్ 6,827 మెట్రిక్ టన్నులుగా నిర్ణయించారు. అయితే సీజన్ టార్గెట్, సరఫరా పరిగణనలోకి తీసుకుంటే ఇంకా 10,814 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరాలి.
సరిహద్దులు దాటినట్లు అనుమానాలు
ఏప్రిల్, మే నెలలో యూరియా వాడకం తక్కువగా ఉండటం, అలాగే జూన్, జూలైలో వర్షాలు లేక యూరియా వినియోగం అంతంత మాత్రంగానే ఉండటంతో పక్కదారి పట్టడానికి అవకాశం ఏర్పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో యూరియా జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లిందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు ప్రాంతంలో యూరియా కేటాయింపులు తక్కువగా ఉండటం, అలాగే పక్క జిల్లాల్లో యూరియా వాడకం కాస్త ఎక్కువగా ఉండటంతో జిల్లా నుంచి తరలించి కొందరు సొమ్ము చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీరికి అధికారులు కొందరు సహకరించారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టులో విస్తారంగా వర్షాలు రావడం, వరి నాట్లు ఊపందుకోవడం, మొక్కజొన్న విస్తీర్ణం పెరగడం, అరటికి వాడకం, అలాగే వేరుశనగ, కంది, ఆముదం తదితర పంటలకు పైపాటుగా వేయాల్సి ఉండటంతో ఒక్కసారిగా యూరియాపై రైతులు దృష్టిసారించారు. కానీ నిల్వలు తక్కువగా ఉండటంతో రైతులు రొడ్డెక్కారు. 20 రోజులుగా యూరియా సమస్య రైతులను పీడిస్తున్నా... తగినంత అందుబాటులో పెట్టించడంలో కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ విఫలమైంది. కూటమి సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖ, విజిలెన్స్, సహకారశాఖ తదితర శాఖలను రంగంలోకి దింపి యూరియా వ్యవహారంపై తనిఖీలు, సోదాలు చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపంచడం లేదని చెబుతున్నారు. ఇక ఈనెల 6న వైఎస్సార్‌సీపీ యూరియాపై పోరుకు పిలుపు ఇవ్వడంతో కూటమి సర్కారు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రైతులు రోడ్డెక్కకుండా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కోటా మేరకు ఇంకా 10,814 మెట్రిక్ టన్నులు రావాలి
యూరియా వాడకంపై జిల్లా యంత్రాంగం హడావుడి
ఈ నెల 6న యూరియా అంశంపై వైస్సార్‌సీపీ నిరసన