
అవుట్ సోర్సింగ్.. ఏజెన్సీపరం
అనంతపురం: జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం (జేఎన్‌టీయూఏ) పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ నుంచి తప్పించి ఏజెన్సీ పరిధిలోకి తెచ్చారు. చిరుద్యోగుల జీవితాలను చిదిమేసే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల 2008లో యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. వర్సిటీ కార్యకలాపాల నిర్వహణకు అవుట్ సోర్సింగ్ కింద నియామకాలు చేపట్టారు. యూనివర్సిటీలో 274, వర్సిటీ పరిధిలోని కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 120, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో 150, క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో 80, ఓటీఆర్‌ఐలో 26 మంది చొప్పున మొత్తం 650 మంది పనిచేస్తున్నారు. వీరందరికి ప్రభుత్వమే జీతాలు చెల్లించేది. అప్పటి నుంచి ఉద్యోగాలు చేస్తున్నవారిని ఇప్పుడు ఏజెన్సీ పరిధిలోకి తీసుకురావడంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. కూటమి ప్రభుత్వం వస్తే తమ జీతాలు పెరుగుతాయని ఆశిస్తే.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
అంతలోనే ఎంత తేడా..
చిరుద్యోగులకు దన్నుగా నిలిచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఆప్కాస్‌ను ఏర్పాటు చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతం చెల్లించేది. ఉద్యోగులను ఇష్టానుసారం తొలగించే పరిస్థితి లేకుండా భద్రత కల్పించింది. పీఎఫ్ సౌకర్యం ఉండేది. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆప్కాస్ నుంచి జీతాలు చెల్లించలేమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆప్కాస్ కింద జీతాలు చెల్లిస్తున్నారు. ఒక్క జేఎన్‌టీయూ అనంతపురంలో మాత్రం ఏజెన్సీ కిందకు తెచ్చారు. దీంతో యూనివర్సిటీ అంతర్గత వనరుల నుంచి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో జేఎన్‌టీయూ అనంతపురంలో ఇద్దరు, కలికిరిలో 5 మందిని మాత్రమే ఉద్యోగాల్లో తీసుకున్నారు. మొత్తం 650 మందిలో గత ప్రభుత్వంలో ఏడుగురిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. 643 మంది గతంలో నుంచి కొనసాగుతున్న వారే. తాజాగా ఏజెన్సీ కిందకు తీసుకరావడంతో జీతాల చెల్లింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏజెన్సీ దయాదాక్షిణ్యాలపైనే ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో జేఎన్‌టీయూ అనంతపురం ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరో వైపు జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్ హాస్టళ్లలో ఆహారం సరఫరాకు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో ఈ తరహాలో ఏజెన్సీ ఆహారం సరఫరా చేస్తోంది. ఇదే జరిగితే హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.
ఎస్కేయూలోనూ అభద్రతే!
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 80 మంది అకడమిక్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలో రెగ్యులర్ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొరత అధికంగా ఉంది. మొత్తం 50 మంది ప్రొఫెసర్లు కూడా రెగ్యులర్‌గా లేరు. ఈ నేపథ్యంలో వీరికి సహాయంగా పీహెచ్‌డీ, నెట్, సెట్ అర్హత పొందిన వారిని అకడమిక్ కన్సల్టెంట్‌లుగా నియామకం చేసుకున్నారు. వీరికి అవర్ బేస్డ్ జీతాలు ఇస్తున్నారు. ఏడాదికోసారి నియామకాలు చేస్తారు. దీంతో వీరికి ఆదివారంతో గడువు పూర్తయింది. తిరిగి రెన్యూవల్ చేయకుండా తాత్సారం చేశారు. దీంతో వీరిలోనూ అభద్రత వెంటాడుతోంది. గడువులోపే రెన్యూవల్ చేసి ఉంటే తరగతులకు విఘాతం కలిగి ఉండేది కాదు. ఈ 80 మంది అకడమిక్ కన్సెల్టెంట్లను కొనసాగించి.. తరగతులకు ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. అధికారుల బాధ్యాతారహిత్యానికి నిదర్శనం అని విద్యార్థులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
జేఎన్‌టీయూఏ పరిధిలో 650 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు
గత ప్రభుత్వంలో ఆప్కాస్ ద్వారా వేతనాలు
ఏజెన్సీకి మార్పు చేసిన కూటమి సర్కారు