
కొల్లగొడుతున్నా కనిపించదా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి అధికార పగ్గాలు చేపట్టాక జిల్లాలో సహజ వనరుల లూటీ యథేచ్ఛగా జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. నదులు, గుట్టలను చెరబట్టి మీటర్ల కొద్దీ తవ్వి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన గనుల శాఖ అసలు పట్టించుకోవడమే లేదు. ఎమ్మెల్యేల ఒత్తిళ్లా.. మామూళ్లు అందుతుండడమా.. అనేది తెలియడం లేదు. రోజూ వందలకొద్దీ టిప్పర్లు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. గనుల శాఖ, పోలీసులు చేస్తున్న ‘మౌనవ్రతం’ దుష్పరిణామాలకు దారి తీస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
కరిగిపోయిన కొండలు...
రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డిపల్లె, ఆలమూరు కొండలు, గుట్టలు ఇప్పటికే కరిగిపోయాయి. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డేలేకుండా పోయింది. ఆలమూరు కొండను దాదాపుగా నేలమట్టం చేశారు. క్రిష్ణంరెడ్డిపల్లెలో భారీ గుట్టల నుంచి రోజూ మట్టిని తరలిస్తున్నారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే రోజూ లక్షల రూపాయల అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తేలింది. అయినా, దీనిపై గనుల శాఖ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.
కర్ణాటకకు విచ్చలవిడిగా..
రాయదుర్గం నియోజకవర్గం ఖనిజ అక్రమ రవాణాకు కేంద్రబిందువుగా మారింది. డీ హీరేహాళ్ మండలం కాదలూరు నుంచి మీటర్ల కొద్దీ హగరి నదిని తవ్వేసి ఇసుకను కర్ణాటకలోని మొలకల్మూర్ నియోజకవర్గం గుండా బళ్లారికి తరలిస్తున్నారు. టీడీపీ కీలక నేత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దందా విలువ రూ. కోట్లలో ఉంటుందని అంచనా. అయినా, గనుల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. రోజూ 200 టిప్పర్లు కర్ణాటకకు వెళుతున్నా పోలీసులూ పట్టించుకోవడం లేదు.
తాడిపత్రి, శింగనమలలో..
తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల పరిధిలో ఉన్న వంకలు, వాగులు స్వరూపమే కోల్పోయాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలే అడ్డుకుంటున్నా అక్రమార్కులపై చర్యలు లేవు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో అయితే పెన్నా నదిలో ఇసుక పూర్తిగా అడుగంటి పోయింది. సుమారు 20 మీటర్ల లోతులో జేసీబీలతో తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. ప్రధాన జాతీయ రహదారిపైనే అక్రమంగా ఇసుక టిప్పర్లు వెళ్తున్నా స్పందించే దిక్కు లేదు.
కూడేరులో అనుమతుల్లేకుండానే..
కూడేరు మండలంలోని పీఏబీఆర్ సమీపంలో అనుమతులు లేకుండా ఇటీవల భారీగా గ్రానైట్ తవ్వకాలు మొదలుపెట్టారు. గనుల శాఖ అధికారులను అడిగితే తాము అనుమతులు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. రోజూ 30 టిప్పర్ల ద్వారా అక్కడ కార్యకలాపాలు నడిచాయి. దీనిపై కొన్ని రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం రాగానే మైనింగ్ ఆపేశారు.
తట్టెడు మట్టికూడా మిగలదు..
ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరులను కొల్లగొడుతుండడం చూస్తే భవిష్యత్ తరాలకు తట్టెడు మట్టి కూడా మిగలదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొండలు నేలమట్టమయ్యాయి. నదుల్లో ఇసుక అడుగంటిపోయింది. భవిష్యత్‌లో ఇళ్లు కట్టాలంటే ఇసుక కనిపించే పరిస్థితి లేదు. దీంతో వచ్చే రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. .
గనుల శాఖ మౌనవ్రతం
సహజ వనరుల లూటీ జరుగుతున్నా కానరాని చర్యలు
రాప్తాడులో గుట్టలు, కొండల్ని పిండిచేసిన ‘తమ్ముళ్లు’
శింగనమల, తాడిపత్రిలో
అక్రమార్కుల చెరలో వంకలు, వాగులు
రాయదుర్గం నుంచి రోజూ
వందల టిప్పర్ల ఇసుక కర్ణాటకకు
గనుల శాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు