
మతిస్థిమితం లేని యువతిపై ఆటో డ్రైవర్ దాడి
కదిరి టౌన్: మున్సిపల్ పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో మతిస్థిమితం లేని యువతిపై మంగళవారం ఆటో డ్రైవర్ ముబారక్ మద్యం మత్తులో మటన్ కొట్టే కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని అభిజ్ఞ ఫౌండేషన్ సభ్యులు అలి, స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘కూటమి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం’
లేపాక్షి: కూటమి పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం లేపాక్షిలోని టూరిజం గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేపరం చేయాలన్న ప్రధాని నరేంద్రమోదీ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీలను ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్నారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడవుతారని స్పష్టం చేశారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే అవకావాలు ఉన్నా ప్రైవేటుపరం చేయడానికి సమాయత్తమవుతున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, రూ.260 యూరియా బస్తాను రూ.500కు విక్రయిస్తున్నారని, డీఏపీపైనా రూ.200 అదనంగా దండుకుంటున్నారని మండిపడ్డారు. జన గణనతోపాటు కుల గణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య పాల్గొన్నారు.