
గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం
● కలెక్టర్‌తో బొప్పాయి రైతు ఓబయ్య ఆవేదన
కూడేరు: వర్షాల వల్ల ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, ఇతర ప్రాంతాలకు బొప్పాయి ఎగుమతి సరిగా లేదు. దీంతో స్థానికంగా గిట్టుధర లేక నష్టపోతున్నామని రైతు ఓబయ్య కలెక్టర్ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మంగళవారం కమ్మూరులో పర్యటించారు. బొప్పాయి సాగు చేసిన ఓబయ్య పొలాన్ని సందర్శించి.. ఎన్ని కోతలయ్యాయి. మార్కెటింగ్ సదుపాయం ఉందా, ఎంత ధరతో విక్రయిస్తున్నారని ఆరా తీశారు. ఇదివరకు కిలో బొప్పాయి రూ.20 వరకు విక్రయించామని, ఇప్పుడు వర్షాలతో కిలో రూ.5లోపే వ్యాపారస్తులు కొనుగోలు చేసి బెంగళూరుకు తరలిస్తున్నారని రైతు తెలిపారు. కనీసం కిలో రూ.10 ఉన్నా గిట్టుబాటు అవుతుందని రైతు తెలిపారు. బొప్పాయిని కోల్డ్ స్టోరేజ్‌లో ఎన్ని రోజులు పెట్టొచ్చని హార్టికల్చర్ అధికారులతో కలెక్టర్ ఆరా తీయగా.. వారం రోజులు కంటే ఎక్కువ రోజులు ఉండదని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంపీ పీడీ రఘనాథ్ రెడ్డి , ఏపీడీ ధనుంజయ్య,, నియోజక వర్గ హార్టికల్చర్ ఆఫీసర్ యామిని , తహసీల్దార్ మహబూబ్ బాషా, ఎంపీడీఓ పాల్గొన్నారు.
ప్రజోపయోగ పనులకు సహకరించాలి
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగం చేపడుతున్న ప్రజోపయోగ పనులకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ అంశంపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి మండలం గన్నేవారిపల్లిలో రైల్వే క్రాసింగ్ 159పైన ఫ్లైఓవర్ నిర్మాణానికి 3.79 ఎకరాల పట్టాభూమి సేకరించాల్సి వస్తుందన్నారు. పరిహారం విషయంలో భూ యజమానులైన రైతులు సహకరించాలన్నారు. ఎకరాకు రూ.38 లక్షలు పరిహారం చెల్లించేలా తీర్మానించామన్నారు. అదే విధంగా తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని 15 గ్రామాల్లో అదానీ రెన్యువబుల్ ఎనర్జీ ద్వారా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌మిషన్ టవర్ల నిర్మాణానికి పరిహారం చెల్లింపు విషయంపై రైతులతో కలెక్టర్ చర్చించారు. జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ మలోల, ఆర్‌డీఓ కేశవనాయుడు, తాడిపత్రి తహసీల్దారు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.