
కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా
● మహిళ దుర్మరణం
● మరో ముగ్గురికి గాయాలు
గుంతకల్లుటౌన్: అడ్డు వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. మరో ముగ్గురు మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మద్దికెర భోగప్పబావి వీధికి చెందిన లలితమ్మ (55) ఇరుగుపొరుగు వారితో కలిసి అరుణాచలం ఆలయానికి వెళ్లేందుకని ఆటోలో గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు బయల్దేరారు. స్టేషన్ ప్రవేశమార్గంలో ఉన్న క్రాస్ వద్ద ఆటోకు కుక్క అడ్డురావడంతో దానిని తప్పించేందుకని డ్రైవర్ యత్నించాడు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. తీవ్రగాయాలపాలైన లలితమ్మను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మరో ముగ్గురు మహిళలు సావిత్రమ్మ, ఈశ్వరమ్మ, స్వాతి స్వల్పంగా గాయపడ్డారు. మృతురాలి కుమారుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా