
మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
పుట్లూరు: భూ వివాదం నేపథ్యంలో పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లికి చెందిన మహిళా రైతు సావిత్రమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు తెలిపిన మేరకు... చింతలపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 72లో 5 ఎకరాల భూమి తన పేరుపై ఉన్నట్లుగా సావిత్రమ్మ చెబుతోంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కులంధర్‌రెడ్డి, వెంకటనారాయణరెడ్డి ఆ భూమిని తాము కొనుగోలు చేశామంటూ సోమవారం ట్రాక్టర్‌తో సేద్యం పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న సావిత్రమ్మ అక్కడకు చేరుకుని సేద్యం పనులు అడ్డుకుంది. అయినా వారు పనులు కొనసాగించడంతో మనస్తాపం చెందిన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఇంటి బయట అరుగుపై పడి ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, ఈ భూ వివాదంపై గతంలో పలుమార్లు ఇరువర్గాల వారు అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది.