
బాబు సర్కారులో ‘బీమా’య
● రైతన్నకు కుచ్చుటోపీ
● 2023, 2024 వాతావరణ బీమా పరిహారం ఇవ్వని వైనం
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు సర్కారు కరువు రైతుకు కుచ్చుటోపీ పెడుతోంది. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో మొదటి ఏడాది పైసా ఇవ్వకుండా రైతులను దారుణంగా మోసపుచ్చింది. ఇటీవల అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద పెట్టుబడి సాయం విడుదల చేసినా.. అందులోనూ వేలాది మందికి కోత విధించింది. ఈ ఒక్క సాయం మినహా చంద్రబాబు సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. తాజాగా వాతావరణ బీమా కింద పరిహారం ఇవ్వకుండా నిలువునా మోసం చేసే పరిస్థితి నెలకొంది.
మూడు సీజన్లకు రూ.77.49 కోట్లే...
ఇటీవల ఫసల్‌బీమా కింద మూడు సీజన్లకు కలిపి (2023 ఖరీఫ్, 2023 రబీ, 2024 ఖరీఫ్) ఫ్యూచర్ జనరిక్ బీమా కంపెనీ ద్వారా కేవలం రూ.77.49 కోట్లు మంజూరు చేయడం గమనార్హం. అందులో 2023 ఖరీఫ్‌కు సంబం ధించి కంది, ఎండుమిరప, జొన్న రైతులకు రూ.3.39 కోట్లు, రబీలో పప్పుశనగ, వేరుశనగ రైతులకు రూ.15.26 కోట్లు విడుదల కానుండగా 2024 ఖరీఫ్‌కు సంబంఽధించి కంది, జొన్న రైతులకు రూ.58.83 కోట్లు.. మొత్తంగా మూడు సీజన్లకు కలిపి ఫసల్‌బీమా కింద రూ.77.49 కోట్లు మంజూరు చేసింది. ఒక్క సీజన్‌కే ఇంతకన్నా అధిక మొత్తంలో పరిహారం ఇవ్వాల్సి ఉండగా మూడు సీజన్లకు చాలా తక్కువగా పరిహారం ఇచ్చి రైతులకు అన్యాయం చేసింది.
రెండేళ్లుగా బీమా లేదు..
2023లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతుల నుంచి ఎలాంటి ప్రీమియం వసూలు చేయకుండా ఈ–క్రాప్ ఆధారంగా సాగు చేసిన ప్రతి పంటకూ ఉచితంగా అటు ఫసల్‌బీమా ఇటు వాతావరణ బీమా పథకాన్ని వర్తింపజేసింది. 2024 జూన్‌లో ప్రభుత్వం మారడంతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. చంద్రబాబు సర్కారు నిబంధనల మేరకు బీమా కింద రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉన్నా దాటవేత ధోరణి అవలంబిస్తోంది. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2018 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా కింద పెద్ద మొత్తంలో పరిహారం అందించింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 2023 ఖరీఫ్, రబీ బీమా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా 6.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,161 కోట్ల బీమా పరిహారం జమ చేయడం గమనార్హం.
ఆశగా రైతన్న..
2023లో ఖరీఫ్‌లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఖరీఫ్‌లో వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, టమాట పంటలకు, ఫసల్‌బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరపకు పరిహారం అందించింది. తొలిసారిగా ఆముదం పంటను కూడా బీమా పరిధిలోకి తెచ్చింది. 2023 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా 3.70 లక్షల హెక్టార్లకు గానూ 2.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం 28 మండలాలతో కరువు జాబితా కూడా ప్రకటించింది. 2023 రబీలో వాతావరణ బీమా కింద అరటి, టమాటకు ఇవ్వగా ఫసల్‌బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, వరి, జొన్న, మొక్కజొన్నకు వర్తింపజేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు విధిలేని పరిస్థితుల్లో ఖరీఫ్‌లో ఉచిత పంటల బీమాను అమలు చేసింది. వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, అరటి, టమాట, చీనీ, దానిమ్మ పంటలు, ప్రధాన మంత్రి ఫసల్‌బీమా పథకం కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరప పంటలకు వర్తింపజేసింది. 2024 ఖరీఫ్‌లో కూడా అననుకూల వర్షాలతో 3.47 లక్షల హెక్టార్లకు గానూ 3.20 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే 2024 రబీ నుంచి ప్రీమియం వసూలు చేస్తూ బీమా పథకాలు అమలు చేశారు. అందులో వాతావరణ బీమా కింద టమాట, మామిడి, ఫసల్‌బీమా కింద పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు వర్తింపజేశారు. 2023, 2024లో అతివృష్టి, అనావృష్టి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. ఈ నాలుగు సీజన్లకు సంబంధించి చంద్రబాబు సర్కారు ఇప్పటి వరకు వాతావరణ బీమా కింద పరిహారం ఇవ్వకుండా దాటవేస్తూ కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నాలు చేస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు.