
పేదల అర్జీలు.. బుట్టదాఖలు!
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు సమర్పించే చాలా అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. పేద ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి ఇస్తున్న వినతిపత్రాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. ప్రధానంగా విభాగాల సూపరింటెండెంట్లకు వెళ్లే అర్జీలు నమోదు కావడం లేదని తెలిసింది. దీంతో అర్జీదారులకు రసీదు అందని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో పరిష్కార వేదికలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓ, ఇతర అధికారులకు సమర్పిస్తారు. అందిన అర్జీలను ఎప్పటికప్పుడు కలెక్టరేట్ ఆవరణలో పరిష్కార వేదిక కౌంటర్లకు సిబ్బంది చేరవేస్తారు. అక్కడి సిబ్బంది వీటిని స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అటు తరువాత అర్జీదారునికి రసీదు ఇస్తారు. నమోదైన అర్జీలు ఆయా శాఖలకు ఆన్‌లైన్‌లోనే పంపిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా అర్జీలను చాలా సందర్భాల్లో అధికారులు కలెక్టరేట్‌లోని విభాగాల సూపరింటెండెంట్లకు అందిస్తున్నారు. వీరు దాన్ని తీసుకుని తమ వద్ద ఉంచుకుంటున్నారే తప్ప కౌంటర్లకు పంపడం లేదని తెలిసింది. దీంతో ఆ వినతిపత్రాలు ఎటూ కాకుండా పోతున్నాయి. ఈ క్రమంలో అర్జీదారునికి రసీదు అందక పరిష్కార స్థితిని కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి ‘పరిష్కార వేదిక’లో సమర్పించే ప్రతి అర్జీ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నేడు కలెక్టరేట్‌లో
‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు అర్జీతో పాటు ఫోన్ నంబర్, ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీ స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
గుంతకల్లు ఆస్పత్రిలో
కరెంటు కష్టాలు
గుంతకల్లు: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ఆదివారం కూడా సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు 2 గంటలకు పైగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు నానా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులో పురిటి బిడ్డలు, బాలింతలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. ఒక వైపు దోమల తాకిడి, మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఆస్పత్రికి గుంతకల్లు పట్టణ, మండలంలోని ప్రజలతో పాటు ఉరవకొండ, కర్నూలు జిల్లా ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన రోగులు వస్తుంటారు.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆస్పత్రిని 150 పడకలకు అప్‌గ్రేడ్ చేసి రూ.13 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దినప్పటి నుంచి రోగుల సంఖ్య మరింతగా పెరిగింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన జనరేటర్‌లో ఇటీవల తరచూ సమస్యలు తలెత్తుతుండడం రోగులకు శాపంగా మారింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన ప్రతిసారీ చుక్కలు కనబడుతున్నాయి. ఆస్పత్రిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాల్సిన కూటమి ప్రభుత్వ పెద్దలు అలసత్వం ప్రదర్శిస్తుండడం మరింత ఇబ్బందిగా మారింది. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జయవర్దన్‌రెడ్డిని వివరణ కోరగా ఆయన స్పందించారు. జనరేటర్‌లో వైర్ల వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. నూతన వైర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేదల అర్జీలు.. బుట్టదాఖలు!