
హాజరులో కనికట్టు... బిల్లులు కొల్లగొట్టు
● రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాలలో మాయాజాలం
● అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రిన్సిపాల్ బాధ్యతలు ఇవ్వడంతో నిర్వాకం
ఉరవకొండ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి గిరిజన గురుకులాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు అందించే భోజనం విషయంలోనూ అవకతవకలకు పాల్పడుతూ జేబులు నింపుకుంటున్నారు. పండుగలు, సెలవుల సమయాల్లో ఇళ్లకెళ్లిన విద్యార్థులను కూడా హాజరైనట్లు నమోదు చేసి బిల్లులు నొక్కేస్తున్నారు. వజ్రకరూరు మండలం రాగులపాడులోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 76 మంది ఉన్నారు. వినాయక చవితి పండుగ కోసం ఆగస్టు 26నే విద్యార్థులు వారి సొంత ఊళ్లకు వెళ్లారు. పిల్లలు పాఠశాలలో లేకున్నా అందరూ ఉన్నట్లుగా గత నెల 30 వరకూ ఆన్‌లైన్‌లో వంద శాతం హాజరు నమోదు చేయడం గమనార్హం. ఆదివారం కూడా గురుకులంలో నలుగురు విద్యార్థులే ఉన్నారు. ఈ క్రమంలో సరుకులను పక్కదారి పట్టించి రోజుకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకూ నొక్కేసినట్లు తెలిసింది.
బాధ్యతలివ్వడమే వివాదాస్పదం..
రాగులపాడు గురుకుల పాఠశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఇటీవల దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి బాల్యనాయక్‌కు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఏకంగా ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. పాఠశాలలో ఏమైనా జరిగితే ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి ఎలా బాధ్యత వహిస్తారనే విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు నమోదులో అవకతవకలు బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నాణ్యమైన భోజనమూ కరువు..
గురుకులంలో పనిచేసే హెడ్‌కుక్ కూడా ఆరు రోజులుగా లేరు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. దీంతో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనమూ అందడం లేదు. గత్యంతరం లేక ఓ ప్రవేట్ వంట మనిషిని ఏర్పాటు చేసుకోని ఉన్న కొద్దిమంది పిల్లలకు భోజనం అందిస్తున్నారు. వీటిపై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
విచారణ చేపట్టాలి..
రాగులపాడు గురుకులంలో విద్యార్థులు లేకపోయినా వంద శాతం హాజరువేసి బిల్లులు నొక్కేయడం దుర్మార్గం. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేకపోవడం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి బాధ్యతలు ఇవ్వడంతోనే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి.
– శివశంకర్‌నాయక్, జీవీఎస్‌ఎస్
రాష్ట్ర అధ్యక్షులు