
నిన్న బుక్ పోస్టు.. నేడు రిజిస్టర్ పోస్టు రద్దు
దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన బుక్ పోస్టును రద్దు చేసిన కేంద్ర తపాలా శాఖ.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సాంకేతిక అందిపుచ్చుకున్న నేటి తరంలోనూ ఏమాత్రం ఆదరణ తగ్గని రిజిస్టర్ పోస్టును ఈ నెల 1 నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
అనంతపురం సిటీ: తక్కువ ఖర్చుతో అనువైన తపాలా సేవగా రిజిస్టర్ పోస్టు.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ సేవలను రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులో విలీనం చేస్తూ కేంద్రంలోని కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన పత్రాలు సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు, ప్రభుత్వ పెద్దలు, అధికారులకు చేరాలంటే రిజిస్టర్ పోస్టును ఏకై క మార్గంగా ప్రజలు భావించేవారు. తపాలా ఉద్యోగులు కూడా అంతే నమ్మకంతో సేవలందిస్తూ వచ్చారు. దీంతో ఎప్పటి నుంచో రిజిస్టర్ పోస్టుకు ఎనలేని ఆదరణ ఉంది.
స్పీడ్ పోస్టుతో ఖర్చు తడిసిమోపెడు
రిజిస్టర్ పోస్టు సేవలను రద్దు చేస్తూ స్పీడ్ పోస్టులోకి విలీనం చేయడం ద్వారా వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. సాధారణంగా ఒక ఎన్వలప్ కవర్‌లో ఏదైనా పత్రం ఉంచి దానిని సాధారణ పోస్టు ద్వారా పంపాలంటే రూ.5 స్టాంపు వేస్తే సరిపోయేది. అదే రిజిస్టర్ పోస్టులో అయితే రూ.17 స్టాంప్ జోడించాల్సి వచ్చేది. ఈ లెక్కన రూ.22తో వారి పత్రాలు భద్రంగా అవతలి వ్యక్తులకు చేరేవి. అయితే అంతే బరువు కలిగిన కవర్ స్పీడ్ పోస్టులో పంపాలంటే రూ.45 చెల్లించుకోక తప్పడం లేదు.