
భూములు లాక్కోవాలని చూస్తే సహించం
● జనార్ధనపల్లి సర్పంచ్, టీడీపీ నేతల దౌర్జన్యంపై పోరాడుతాం
● వైఎస్సార్‌సీపీ నేతల స్పష్టీకరణ
ఉరవకొండ: అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించబోమని, బాధిత రైతులతో కలసి విస్తృత పోరాటాలు సాగిస్తామని టీడీపీ నేతలను వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. ఉరవకొండకు చెందిన బాధిత రైతు జయకుమార్‌తో కలసి ఆదివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, సింగాడి తిప్పయ్య, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, పార్టీ మండల సమన్వయకర్త మూలగిరిపల్లి ఓబన్న తదితరులు మాట్లాడారు. జనార్ధనపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 141లో 21.05 ఎకరాల భూమిని సాయిప్రసాద్, వెంకటశర్మ, భానుప్రకాష్‌రావు నుంచి 2023, జూన్ 24న రైతు జయకుమార్ కొనుగోలు చేసి, పంటల సాగు చేపట్టాడన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూమిని కబ్జా చేసేందుకు కొందరు టీడీపీ నేతలు ప్రయత్రిస్తూ జయకుమార్‌ను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కేశవ్ అండతో జనార్ధనపల్లి గ్రామ సర్పంచ్ (టీడీపీ) రామంగి జనార్ధననాయుడు, టీడీపీ నాయకులు సుధాకర్, ముప్పారపు పాండురంగ, కురుపాటి కృష్ణమూర్తి దౌర్జన్యాలకు తెరలేపారన్నారు. తమది కాని భూమిలో చొరబడి కంది పంట సాగుచేయడానికి పొలాన్ని దుక్కి చేశారన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన బాధిత రైతుపై దౌర్జన్యం చేశారన్నారు. దీంతో రైతు జయకుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అయినా టీడీపీ నేతలు దౌర్జన్యం సాగిస్తూ మొత్తం 21 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కుట్రలు సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా టీడీపీ నేతలు తమ దౌర్జన్యాలకు స్వస్తి చెప్పకపోతే బాధిత రైతు తరఫున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో చాబాల సర్పంచ్ జగదీష్, నాయకులు సుంకన్న, మర్రిస్వామి, డిష్ వెంకటేష్, సురేష్, రామాంజనేయులు పాల్గొన్నారు.
హెచ్‌ఎం అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిగా విజయభాస్కరరెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) సంఘం రాష్ట్ర కమిటీలో జిల్లాకు కీలక పదవి లభించింది. సంఘం రాష్ట్ర కోశాధికారిగా ఉరవకొండ మండలం బూదగవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.విజయభాస్కర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం విజయవాడలోని లయోలా కళాశాలలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయభాస్కరరెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు అనంతపురం జిల్లా హెచ్‌ఎం అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
బాత్రూంలో జారిపడి
అర్చకుడి మృతి
కనగానపల్లి: మండలంలోని తగరకుంట గ్రామంలో ఆదివారం బాత్రూంలో కాలుజారి పడి అర్చకుడు సతీష్‌కుమార్ (45) మృతి చెందాడు. రాప్తాడు మండలం పాలచర్ల రామాలయంలో ఆయన పూజారిగా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఇంటి వద్ద బాత్రూంలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు గుర్తించి ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సతీష్‌కుమార్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.

భూములు లాక్కోవాలని చూస్తే సహించం