
సమస్య పరిష్కరించాలంటూ గొడవ
అనంతపురం అర్బన్: తనకు మంజూరైన టిడ్కో ఇంటిని వేరొకరికి ఇచ్చారని, దీనిపై వందలసార్లు అర్జీ ఇచ్చినా సమస్యకు పరిష్కారం చూపలేదంటూ ఇన్‌చార్జి కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోలతో అనంతపురంలోని కోవూరు నగర్‌లో నివాసముంటున్న రఘు గొడవపడ్డాడు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనను ఏ కారణం చేత అనర్హుడిగా ముద్ర వేశారంటూ నిలదీశాడు. ఇల్లు ఇవ్వరు... అందుకు కారణం చెప్పరంటూ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. అధికారులు నచ్చచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని బలవంతంగా ఆయనను బయటకు పంపాల్సి వచ్చింది. బయటకు వచ్చిన అనంతరం రఘు మాట్లాడుతూ.. 2018లో తనకు టిడ్కో కింద ఇల్లు మంజూరైందన్నారు. అటు తరువాత తన పేరున ఉన్న ఇంటిని వేరొకరికి ఇచ్చారని వాపోయాడు. ఇదేమని అడిగితే నిన్ను ఇనెలిజిబుల్ (అనర్హునిగా) చేశారని చెబుతారే తప్ప కారణం చెప్పడం లేదన్నారు. తనకు మంజూరైన ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎఫ్‌ఎస్‌ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, రామ్మోహన్, మల్లికార్జునుడు, వ్యసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 463 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
తల్లిపాలు శ్రేష్టం
తల్లి పాలు బిడ్డకు అత్యంత శ్రేష్టమనే విషయంపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు–2025 పోస్టర్లను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. ఈ నెల 7వ తేదీ వరకూ తల్లిపాల ఆవశ్యక్తపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఐసీడీఎస్ పీడీ నాగమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్‌పై ర్యాలీ..
ప్రతి నెల 5న సచివాలయాల పరిధిలో వాట్సాప్ గవర్నెన్స్‌పై ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. వాట్సాప్స్ గవర్నెన్స్ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఆయన విడుదల చేశారు.
ఉన్నతాధికారిని నిలదీసిన
సామాన్యుడు
పరిష్కార వేదికలో 463 వినతులు
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి : ఇన్‌చార్జ్ కలెక్టర్