
50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
బొమ్మనహాళ్: కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ జమాల్‌బాషా తెలిపిన మేరకు.. అందిన సమాచారం మేరకు సోమవారం బొమ్మనహాళ్ మండలం శ్రీరంగాపురం క్యాంపు వద్ద విజిలెన్స్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన బొలెరో వాహనంలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి స్ధానిక పీఎస్‌కు తరలించారు. ఆర్‌ఐ బాలకృష్ణ ఫిర్యాదు మేరకు డ్రైవర్ నాగరాజు, బియ్యం వ్యాపారి రామకృష్ణ, బొలేరో వాహన యజమాని వీరభద్రస్వామిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. కాగా, పట్టుబడిన రేషన్ బియ్యాన్ని బొమ్మనహాళ్, విడపనకల్లు మండలాల్లో పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లుగా నిందితులు అంగీకరించారు.
ప్రభుత్వంతో జేఎన్‌టీయూ అవగాహన ఒప్పందం
అనంతపురం: పరిశ్రమల్లో రక్షణాత్మక విధానాలపై అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో జేఎన్‌టీయూ(ఏ) ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జేఎన్‌టీయూ అనంతపురం రిజిస్ట్రార్ కృష్ణయ్య పరస్పరం మార్చకున్నారు. ఈ ఒప్పందం మేరకు పరిశ్రమల్లో కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా ఎలాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించుకోవాలనే అంశంపై జేఎన్‌టీయూలోని ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెకానికల్ అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు తగిన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అలాగే పరిశ్రమల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ(ఏ) డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, కార్మికశాఖ అదనపు కార్యదర్శి గంధం చంద్రుడు, తదితరులు పాల్గొన్నారు.

50 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత