
విద్యుత్ చార్జీలు తగ్గించాలి
కూడేరు: విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సర్ధుబాటు చార్జీల పేరిట ఏకంగా రూ.15485 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రజలపై మోపడం దారుణమన్నారు. సోమవారం కూడేరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కంలో లోటును భర్తీ చేయడానికి ట్రూ ఆప్ చార్జీల పేరిట రూ.12771 కోట్ల అదనపు భారాన్ని మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందని మండిపడ్డారు. ఈ ఆలోచనకు స్వస్తి చెప్పడంతో పాటు ఇప్పటికే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేలు ఇస్తామంటూ ప్రకటించి.. తాజాగా పీఎం కిషాన్‌తో కలిపి విడుతల వారీగా ఇస్తామని ప్రకటించడం కుట్రలో భాగంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపి, తొలుత కాలువ వెడల్పు పనులు పూర్తి చేయాలని, పిల్ల కాలువలు ఏర్పాటు చేసి ఆయకట్టుకు నీరందించాలన్నారు కోరారు. సమస్యలపై ఈ నెల 12,13 తేదీల్లో జరిగే సీపీఐ జిల్లా మహా సభల్లో చర్చించి, ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కేశవ రెడ్డి, మండల కార్యదర్శి నాగేంద్ర, నేతలు మల్లికార్జున, పెరుగు సంగప్ప, రమణ, మలరాయుడు, వెంకటేష్, శ్రీరాములు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్