
వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
యాడికి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయచెరువులోని ఉప్పర వీధిలో నివాసముంటున్న శ్యామలమ్మ కుమారుడు భరత్‌కుమార్ (39) ట్రాన్స్ పోర్టు లావాదేవీలతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నష్టం రావడంతో తన సొంత లారీలను అమ్మేసి ఓ లారీ డ్రైవర్‌గా జీవనం మొదలు పెట్టాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటిని కూడా అమ్మేశాడు. దీంతో దిక్కుతోచని శ్యామలమ్మ కర్నూలులోని తన చెల్లెలు కుమార్తె ప్రభావతి ఇంటికి చేరుకుంది. ఆదివారం రాత్రి రాయలచెరువులోని హెచ్‌పీ పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న గాలి మిషన్ వద్ద నిద్రించిన భరత్‌కుమార్.. సోమవారం వేకువజాము 1 గంట సమయంలో నిద్ర లేచి రోడ్డు దాటుతుండగా తాడిపత్రి నుంచి గుత్తి వైపు వెళుతున్న వాహనం ఢీకొంది. తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ ఈరన్న అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని వాహనంలో తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే భరత్‌కుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తల్లి శ్యామలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.