
అధికారుల అండతోనే బరితెగింపు!
అనంతపురం క్రైం: అధికారుల అండతోనే ‘పచ్చ’ గద్దలు బరితెగించినట్లు తెలిసింది. ఓ సివిల్ వివాదంలోకి రక్షణ పేరిట పోలీసులు తలదూర్చడం ఇందుకు బలం చేకూరుస్తోంది. వివరాలు.. అనంతపురం నగర శివారులోని ఎంకేఎం ఫంక్షన్ హాలు సమీపాన జాతీయ రహదారికి ఆనుకుని సర్వే నంబర్లు 209–210లోని రూ. కోట్ల విలువైన భూమిలోకి రెండు రోజుల క్రితం కొందరు వ్యక్తులు జేసీబీలతో ప్రవేశించడం కలకలం రేపింది. అయితే, ఈ వ్యవహారంలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ రహదారికి ఆనుకుని భూమి ఉండడం, రూ. కోట్లు విలువ చేస్తుండడంతో భూమిని కాజేసేందుకు కొన్ని శక్తులు చేతులు కలిపినట్లు తెలిసింది. బాధితుల కథనం మేరకు..అక్రమార్కులకు నగర ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు అండగా ఉన్నారు. అక్రమార్కులు ఆ భూమి వివరాలను స.హ చట్టం ద్వారా తెలుసుకుని నకిలీ పత్రాలు సృష్టించారు. ముందుగా వీఆర్‌ఓ, డీటీ స్థాయి అధికారులకు ఎర వేశారు. వారి ద్వారా మ్యానువల్ వంశ వృక్షాన్ని పుట్టించారు. నకిలీ జీపీ కూడా సిద్ధం చేశారు. ఓ సబ్‌రిజిస్ట్రార్‌తో చేతులు కలిపి బేరం కుదుర్చుకున్నారు. చివరిగా ఓ పోలీసు అధికారిని కలసి రక్షణ కోరారు. సర్వే చేయించుకుంటామంటే కొందరు అడ్డొస్తున్నట్లు కట్టుకథ అల్లారు. శనివారం జేసీబీలతో భూమిలోకి దిగారు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే పోలీసులతో హెచ్చరికలు చేయించారు. పక్కనే ఉన్న ఓ కల్యాణమండపం యజమానికి కూడా అక్రమార్కులు హెచ్చరికలు చేశారు. మండపంలో కూడా కొంత భాగం తమకొస్తుందంటూ బెదిరించారు. స్థానికంగా ప్లాట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న బండలు, సరిహద్దుల రాళ్లను ధ్వంసం చేసి భయాందోళన సృష్టించారు.
ప్రైవేటు కేసులకు రెడీ..
కోర్టు తీర్పు కాపీలు తీసుకుని నెలల తరబడి తిరిగితేగాని రక్షణగా రాని పోలీసులు అక్రమార్కులు కోరగానే ఎందుకు తలదూర్చారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ విషయంపై బాధితులు సంబంధిత శాఖల్లో ఎవరైతే అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తారో వారిపై ప్రైవేటు కేసులు వేయాలని భావిస్తున్నారు. భూ వివాదంలో నకిలీలపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు.
నా సంతకం కాదేమో: వీఆర్‌ఓ
209–210 సర్వే నంబర్లకు సంబంధించి మీరిచ్చిన రిపోర్టు నిజమేనా అని ‘సాక్షి’ ప్రశ్నించగా సదరు వీఆర్‌ఓ స్పందించారు. రిపోర్టులోని సంతకం తనది కానట్టే ఉందన్నారు. రిపోర్టు ఇచ్చిన రోజు తాను ఇన్‌చార్జ్‌గా ఉన్నానని తెలిపారు.
‘పచ్చ’ గద్దల వ్యవహారంలో
వెలుగులోకి విస్తుపోయే అంశాలు