ప్రైవేట్‌ భూమిపై వాలిన ‘పచ్చ’ గద్దలు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ భూమిపై వాలిన ‘పచ్చ’ గద్దలు

Aug 3 2025 3:12 AM | Updated on Aug 3 2025 3:12 AM

ప్రైవేట్‌ భూమిపై వాలిన ‘పచ్చ’ గద్దలు

ప్రైవేట్‌ భూమిపై వాలిన ‘పచ్చ’ గద్దలు

యజమానులను దరిదాపుల్లోకి రానీయని పోలీసులు

బాధితుల్లో విశ్రాంత న్యాయమూర్తి, మరికొంతమంది

అనంతపురం క్రైం: అధికార తెలుగుదేశం పార్టీ అండతో కొందరు నాయకులు రూ.కోట్లు విలువైన ప్రైవేట్‌ భూమిని కొట్టేసేందుకు పన్నాగం పన్నారు. ఏకంగా పోలీసుల రక్షణలో భూమిని చదును చేయించడం.. అసలైన ప్లాట్ల యజమానులను దరిదాపుల్లోకి రాకుండా హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు... అనంతపురం నగర శివారులోని ఎంకేఎం ఫంక్షన్‌హాలు సమీపాన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వే నంబరు 209, 210లో మొత్తం 12 ఎకరాలు భూమి ఉంది. ఇందులో గంగాధర, లింగమ్మ, మారెన్న, మంజునాథ, లక్ష్మీదేవితో పాటు పదుల సంఖ్యలో వ్యక్తులకు ప్లాట్లు ఉన్నాయి. విలువైన ఈ స్థలాలపై టీడీపీకి చెందిన పెద్ద మనుషులు కన్నేశారు. సమీప బంధువును ముందుంచి భూమిని కాజేసేందుకు పథకం వేశారు. అందుకు అనుగుణంగా శనివారం మందీమార్బలంతో పాటు పోలీసులను రక్షణగా తీసుకుని సదరు సర్వే నంబర్లలోని భూమిలోకి జేసీబీలతో వచ్చారు. ఇదివరకే అక్కడున్న బండలు, షెడ్లు కూల్చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని పోలీసులు వారి స్థలాన్ని సర్వే చేయించుకుంటున్నారని, ఎవ్వరూ అడ్డు రావద్దని స్పష్టం చేయడంతో వెనక్కు తగ్గారు. తహసీల్దార్‌ సెలవులో ఉండగా.. సర్వేకు ఎలా అనుమతిచ్చారు? సివిల్‌ వివాదంలో రక్షణ పేరిట పోలీసులు ఎందుకు తలదూరుస్తున్నారో స్థానికులకు అంతుబట్టలేదు. తమ వద్ద ప్లాట్లకు సంబంధించి డాక్యుమెంట్లు ఉన్నాయని చెబుతున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. ప్లాట్లు కబ్జాకు గురవుతున్న బాధితుల్లో విశ్రాంత న్యాయమూర్తి ఒకరు ఉన్నారు. ఆయన ఈ వ్యవహారంపై ఎస్పీని నేరుగా కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అసలు కబ్జాదారులు ఏ డాక్యుమెంట్లు చూపిస్తే పోలీసులను రక్షణగా పంపించారని ప్రశ్నించినట్లు సమాచారం. స్పందించిన ఎస్పీ డీఎస్పీని విచారణకు ఆదేశించారు. రూ.కోట్లు విలువ చేసే స్థలాలను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బాధితులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ స్పందించి న్యాయం చేయకపోతే.. తాము ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు.

‘రైతులను బిచ్చగాళ్లుగా చూస్తున్నారు’

గుంతకల్లు: రాష్ట్రంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ పాలకులు రైతులను బిచ్చగాళ్లుగా చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్‌ విమర్శించారు. శనివారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఒక్క అనంతపురం జిల్లాలోనే 8.55 లక్షలు ఎకరాలకు గాను 3 లక్షల ఎకరాల్లో మాత్రమే విత్తనం వేసినట్లు జిల్లా వ్యవసాయధికారులు ప్రకటించారన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాల్లో విత్తనం వేయాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దుర్భర పరిస్థితి నెలకొన్న తరుణంలో అన్నదాత సుఖీభవ కింద మీరు (ప్రభుత్వాలు) రూ.7వేలు ఇచ్చి.. దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎకరాకు రూ.25వేలు ఇచ్చినా అ డబ్బులు రైతులకు సరిపోవన్నారు. సాగుకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహరక మందులు 50 శాతం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక హంద్రీ–నీవా కాలువ వెడుల్పు చేసిన ఉమ్మడి అనంత జిల్లాకు ఏ మాత్రమూ ప్రయోజనం లేదన్నారు. రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేయడానికి బనకచెర్ల నీటి పథకాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శంచారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, బి.మహేష్‌, గోపీనాథ్‌, ఎస్‌ఎండీ గౌస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement