
కళామతల్లి ముద్దుబిడ్డ బళ్లారి రాఘవ
అనంతపురం అర్బన్: నాటక పితామహుడు బళ్లారి రాఘవ కళామతల్లి ముద్దుబిడ్డ అని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. ఆయన జీవితం తెలుగుజాతికి మణిహారమంటూ కొనియాడారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో బళ్లారి రాఘవ 145వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై బళ్లారి రాఘవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మట్లాడుతూ బళ్లారి రాఘవ నాటకరంగానికి వన్నె తెచ్చారన్నారు. ఆయన సామాజిక సంఘ సంస్కర్త అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. బళ్లారిలో షేక్స్‌పియర్ క్లబ్ ప్రారంభించి పలు నాటకాలను ప్రదర్శించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయన ప్రజ్ఞను గుర్తించిన అప్పటి ఆంగ్ల ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించడమే కాకుండా లాల్‌బహదూర్ అనే బిరుదుతో సత్కరించిందన్నారు. సంపన్న కుటుంబానికి చెందినా నిరాండంర జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి బళ్లారి రాఘవ అని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, డీఈఓ ప్రసాద్‌బాబు, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, సూపరింటెండెంట్లు యుగేశ్వరిదేవి, రియాజుద్ధీన్, కళా సంస్థ ప్రతినిధి మైకెల్‌బాబు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు తప్పనిసరి
కూడేరు: అహుడా లే అవుట్లలో మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ స్వామి శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కూడేరు, బ్రాహ్మణపల్లిలోని అహుడా లేఅవుట్లను పరిశీలించారు. లేఅవుట్ల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, అహుడా లేఅవుట్ తెలిపేలా శాశ్వత హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి,, అహుడా ఈఈ దుశ్యంత్, డీఈ రేవంత్, తహసీల్దార్ మహబూబ్ బాషా, రీసర్వే డీటీ ప్రసాద్, సర్వేయర్ ఆయేషా సిద్ధిఖీ, వీఆర్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.