
12, 13 తేదీల్లో సీపీఐ జిల్లా మహాసభలు
అనంతపురం అర్బన్: సీపీఐ జిల్లా మహాసభలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్ తెలిపారు. శనివారం నగరంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు. పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తా మని చెప్పి ఏడాదైనా అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి వాటి పరిష్కారానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు రాజారెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు లింగమయ్య, కత్తి నారాయణస్వామి, రాజేష్ గౌడ్, సంతోష్‌కుమార్, పద్మావతి, అల్లీపీరా, పెద్దయ్య, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు.
5న విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన
అనంతపురం అర్బన్: విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలను దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీన విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు తెలిపారు. శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, ఎస్‌యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు నాగరాజు మాట్లాడారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. స్మార్ట్ మీటర్లు పగులకొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుబాటు చార్జీల పేరుతో రూ.15,485 కోట్లు భారం మోపిందన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.2,787 కోట్లు అదనపు భారం వేశారన్నారు. ఈ భారాలను కప్పిపుచ్చి రూ.460 కోట్లు ట్రూడౌన్ ద్వారా తగ్గిస్తున్నట్లు నమ్మబలుకుతున్నారని విమర్శించారు. తాజాగా మరో రూ.12,700 కోట్లు భారాన్ని వినియోగదారులపై మోపనుందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజారెడ్డి, నాగేంద్రకుమార్, నాగమణి, బాలరంగయ్య, శ్రీరాములు, రామాంజనేయులు, వీరనారప్ప, తదితరులు పాల్గొన్నారు.