
యాటకల్లులో దొంగల హల్‌చల్
శెట్టూరు: యాటకల్లులో దొంగలు పట్టపగలే హల్‌చల్ చేశారు. శనివారం సాయంత్రం గ్రామ చివరున్న మోటార్ పంపుసెట్ వైర్లు, స్టార్టర్ బాక్సులను ముగ్గురు దుండగులు తొలగించి ఎత్తుకుపోతుండగా.. అటుగా వస్తున్న ఓ రైతు వారిని ఎవరు మీరని వివరాలు అడిగాడు. దీంతో దుండగులు రైతును బెదిరించి ముందుకెళ్లారు. వెంటనే రైతు గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకొని దుండగులను పట్టు కున్నారు. సర్పంచ్ ఈరన్న సమాచారంతో ఎస్‌ఐ రాంభూపాల్ వచ్చి దుండగులను స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు. పోలీసులు విచారించి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాప్తాడురూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కొట్టాల దారిలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన వెంకటరమణనాయుడు (43) బలపంరాయి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం అనంతపురం వచ్చాడు. వచ్చిన పని పూర్తికాలేదని కాటిగానికాలువ గ్రామంలో స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నట్లు భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి అనంతపురం వచ్చే సమయంలో బీజేపీ కొట్టాలకు వెళ్లే క్రాస్ వద్ద కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వారు గమనించి అతడిని సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకటరమణనాయుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య శ్యామల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

యాటకల్లులో దొంగల హల్‌చల్