
జిల్లాలో పోలింగ్ కేంద్రాల పెంపు
అనంతపురం అర్బన్: పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ తరువాత జిల్లాలో కొత్తగా 330 కేంద్రాలు పెరిగినట్లు డీఆర్‌ఓ మలోల తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణపై శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ కొత్తగా జారీ చేసిన నిబంధన ప్రకారం పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,200 మంది ఓటర్ల ఉండాలన్నారు. అంతకు మించి ఓటర్లు ఉంటే అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 2,226 పోలింగ్ కేంద్రాలు ఉండగా హేతుబద్ధీకరణ తరువాత 330 పెరిగి కేంద్రాల సంఖ్య 2,556కు చేరినట్లు వివరించారు.
రెండు కిలోమీటర్ల పరిధిలోనే
ప్రస్తుతం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలన్నీ ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని, వీటికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. ఇందుకు సంబంధించి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని కోరుతూ పరిశీనార్థం కొత్త పోలింగ్ కేంద్రాల జాబితాను నియోజకవర్గ స్థాయిలో ఆయా పార్టీల ప్రజాప్రతినిధులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి సానుకూలత వచ్చిన తర్వాత జిల్లాస్థాయిలో తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల మార్పునకు 48, కేంద్రం పేరు మార్పునకు 7 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటిని ఆమోదం కోసం జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపనున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు అమర్‌నాథ్‌రెడ్డి, రాధాకృష్ణ, టీడీపీ నారాయణస్వామి, బీజేపీ ఈశ్వరప్రసాద్, జనసేన కిరణ్‌కుమార్, ఐఎన్‌సీ ఇమామ్‌వలి, సీపీఎం బాలరంగయ్య, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్‌వలి, ఈఆర్‌ఓలు కేశనాయుడు, తిప్పేనాయక్, రమేష్‌రెడ్డి, మల్లికార్జునుడు, రామ్మోహన్, కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ యుగేశ్వరిదేవి, డీటీ కనకరాజు, ఎస్‌ఏ శామ్యూల్ బెంజిమన్, ఈడీటీలు పాల్గొన్నారు.
హేతుబద్ధీకరణతో
కొత్తగా 330 కేంద్రాలు
అత్యధికంగా అనంతపురంలో 70
అత్యల్పంగా కళ్యాణదుర్గం,
శింగనమలలో 21 చొప్పున కేంద్రాలు

జిల్లాలో పోలింగ్ కేంద్రాల పెంపు