
‘ఆ టీచర్ మా కొద్దు’
ముదిగుబ్బ: మండలంలోని బ్రహ్మదేవరమర్రి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు వి. రోజారాణి తమకొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి కేటాయించిన ఉపాధ్యాయురాలు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. సమయపాలన పాటించడం లేదన్నారు. పాఠశాలలోనే నిద్ర పోతుంటారన్నారు. గ్రామస్తులు ప్రశ్నిస్తే మా ఆయన పోలీస్, మీపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతానంటూ బెదిరింపులకు దిగుతోందని వాపోయారు. ఇలాంటి ఉపాధ్యాయులతో తమ పిల్లల విద్యాభివృద్ధి కుంటుపడుతుందని, ఆమెను బదిలీ చేసి, మరో ఉపాధ్యాయుడిని నియమించాలంటూ కోరారు. దీనిపై స్పందించిన ఎంఈఓ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు.
ఖాద్రీశుడికి ప్రత్యేక పూజలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో సావ్మి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదిరి పరిసరాల ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఆలయ అధికారుల తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం ఏర్పాటు చేశారు.