
గుడ్డు.. వెరీ బ్యాడ్
● పాఠశాలలు, అంగన్‌వాడీలకు నాసిరకం గుడ్లు సరఫరా
గుంతకల్లుటౌన్/తాడిపత్రిరూరల్: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లోపించింది. 25 శాతం కుళ్లిపోయిన, చిన్న సైజు గుడ్లను అందజేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పాఠశాలల్లో కొందరు విద్యార్థులైతే మధ్యాహ్న భోజనంలో అందజేస్తున్న కోడిగుడ్లు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రప్రసాద్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సుమారు 1,350 మంది విద్యార్థులు ఉండగా..వారానికి ఆరు వేల గుడ్ల వరకు అందుతున్నాయి. వీటిలో 300 దాకా పగిలిన, కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయి. కొన్ని కోడిగుడ్ల బరువు 30 గ్రాములు మాత్రమే ఉంటోంది. శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించగా..గుడ్లు నాణ్యత లేని విషయం వెలుగులోకి వచ్చింది. మంచి ప్రభుత్వమని చెప్పుకునే కూటమి సర్కారు నాసిరకమైన గుడ్లను సరఫరా చేస్తూ విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందని, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వెంకటేష్ డిమాండ్ చేశారు. కొన్ని డ్యామేజీ, చెడిపోయిన గుడ్లు సరఫరా అవుతున్న మాట వాస్తవమేనని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిబాబు తెలిపారు. ఈ అంశంపై ఎంఈఓకు లేఖ రాశామన్నారు. గుడ్ల నాణ్యతపై విద్యార్థులను విచారించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని గుంతకల్లు ఎంఈఓ మస్తాన్ రావు చెప్పారు.
అంగన్‌వాడీ గుడ్లలో కోత!
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లలో కోత పెడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 302 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రతి నెలా నాలుగు విడతలుగా దాదాపు 4.28 లక్షల కోడిగుడ్లను సరఫరా చేయాలి. కానీ జూలైలో మూడు, నాల్గవ విడతగా ఇవ్వాల్సిన 2.9 లక్షల గుడ్లను సరఫరా చేయలేదు. అలాగే ఈ ఏడాది మార్చిలో 20,060, ఏప్రిల్‌లో 17,068, మేలో 55,717, జూన్‌లో 59,359 గుడ్లు సరఫరా కాలేదని అంగన్‌వాడీ సిబ్బందే చెబుతున్నారు. అరకొర గుడ్ల సరఫరా, సైజులో వ్యత్యాసంపై ఇప్పటికే పై అధికారులకు నివేదిక పంపామని ఐసీడీఎస్ తాడిపత్రి ప్రాజెక్టు సీడీపీఓ సాజిదాబేగం తెలిపారు. పైనుంచి గుడ్లు సరఫరా కావడం లేదని కాంట్రాక్టర్ అంటున్నారన్నారు.

గుడ్డు.. వెరీ బ్యాడ్