
ఆటో కింద పడి చిన్నారి మృతి
గార్లదిన్నె: ప్రమాదవశాత్తు ఆటో కింద పడి ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన వెంకటనాయుడు కొంత కాలంగా గార్లదిన్నె మండలం కల్లూరు కొండ కింద కొట్టాలలో నివాసముంటున్నాడు. ఆయన కుమార్తె తనూజ (9) గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. రోజూ ఆటోలో పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో వస్తుండగా ఇంటి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చే మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో ఆటోను డ్రైవర్ రివర్స్ చేశాడు. అయితే ఈ విషయం తెలియని తనూజ ఉన్నఫలంగా ఆటో దిగడంతో అదుపు తప్పి కిందపడింది. డ్రైవర్ గమనించేలోపు వాహనం బాలికపైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అదే ఆటోలో పామిడిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.