
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి తప్పనిసరి
అనంతపురం అర్బన్: అహుడా పరిధిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు కచ్చితంగా అనుమతి పొందాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. అహుడా పరిధిలో వీలైనంత ఎక్కువగా భూ బ్యాంక్ గుర్తించాలని చెప్పారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అహుడా ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అనంతపురం, మడకశిర, కళ్యాణదుర్గం, గుత్తి, పుట్టపర్తి, హిందూపురం, పెనుకొండ తదితర ప్రాంతాల్లో అహుడా చేపట్టిన పనులు, వాటి పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహుడా పరిధిలో ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకోని వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం చేసుకుని ఈ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. నగర, పట్టణ కేంద్రాల్లో నివాసయోగ్యమైన ప్రాంతాలకు దగ్గరగా భూములను ఎంపిక చేయాలని చెప్పారు. భూ సేకరణ క్రమంలో పెండింగ్ పనులను సత్వరం పూర్తి చేయాలని సూచించారు.లే అవుట్లలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అహుడా కార్యదర్శి జి.రామకృష్ణారెడ్డి, ప్లానింగ్ అధికారి ఇషాక్, ఈఈ దుష్యంత్, జేపీఓ హరీష్, సర్వేయర్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
‘అన్నదాత సుఖీభవ’కు ఏర్పాట్లు చేయండి
‘అన్నదాత సుఖీభవ పథకం’ ఈనెల 2న ప్రారంభం కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈనెల 2న ప్రకాశం జిల్లా దర్శిలో పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం వీక్షణకు ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. సచివాలయ స్థాయిలోనూ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జిల్లాలో 2,80,418 మంది అర్హులైన రైతులు ఉండగా, ఇందులో 2,74,210 మంది రైతులకు ఈ–కేవైసీ పూర్తయ్యిందన్నారు. 5,579 మందికి ఈ–కేవైసీ తిరస్కరణ జరిగిందన్నారు. 629 మంది ఈ–కేవైసీ పెండింగ్‌లో ఉందని, ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించాలని చెప్పారు. ప్రతి రైతుకూ లింక్ షేర్ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ పోర్టల్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లోని ‘మీ స్థితిని తెలుసుకోండి’ ఎంపిక ద్వారా రైతుల అర్హత, అనర్హత కారణాలను పరిశీలించుకోవచ్చన్నారు. ఎన్‌ీపీసీఐ లింక్ కానివారు యాక్టివేట్ చేసుకోవాలని కోరారు. ఆధార్‌ను బ్యాంక్ ఖాతాకు జత చేయాలని సూచించారు.
ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ