
టీడీపీ సర్పంచ్ దౌర్జన్యం
● తనది కాని భూమిలో చొరబడి విత్తనం వేసిన వైనం
● ఎలా వేస్తారంటూ ప్రశ్నించిన రైతుపై దౌర్జన్యం
ఉరవకొండ(విడపనకల్లు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డు లేకుండా పోతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఈ పరిస్థితి తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా విడపనకల్లు మండలం జనార్దనపల్లికి చెందిన టీడీపీ సర్పంచ్, తన అనుచరులతో కలసి తనది కాని భూమిలో దౌర్జన్యంగా విత్తనం వేయడం కలకలం రేపింది. ఉరవకొండ పట్టణానికి చెందిన బాధిత రైతు జయకుమార్ విడపనకల్లు డిప్యూటీ తహసీల్దార్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. 2023, జూన్ 24న జనార్దనపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 141లో 21.05 ఎకరాల భూమిని రైతు జయకుమార్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ భూమిలో మిర్చి, కందులు తదితర పంటలు సాగు చేస్తున్నాడు. గురువారం ఉదయం ఆ గ్రామ సర్పంచ్ జనార్దననాయుడు, మరికొందరు టీడీపీ నాయకులు ఆ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ట్రాక్టర్‌తో కంది విత్తనం వేశారు. విషయం తెలుసుకున్న జయకుమార్, ఆయన కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని సర్పంచ్‌ను నిలదీశారు. ఆ సమయంలో బాధిత రైతు, ఆయన కుటుంబసభ్యులపై సర్పంచ్ దౌర్జన్యం చేస్తూ దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోవాలని బెదిరింపులకు దిగారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్, డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు తెలిపాడు. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని వాపోయాడు.