
వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్: గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటన అడ్డుకుంటారనే సాకు తో బుధవారం వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో విద్యార్థి విభాగం రాష్ట్ర నేత షెక్షావలి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు గూబనపల్లి నాగరాజు, కో ఆప్షన్ సభ్యుడు సల్లా మారుతి, మమతా సురేష్, నాయకులు బిక్కి హరి, చరణ్, దొడగట్ట మురళి, ఎరికల రమేష్, అజయ్, టైలర్ శీన, సూరి, వడ్డే అజయ్ ఉన్నారు. ఉదయం అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా డాక్టర్ల విభాగం అధ్యక్షుడు బొమ్మయ్య ఖండించారు. వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు చీకటి మయం అయ్యాయని మండిపడ్డారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు.
రైతుకు న్యాయం చేస్తాం
పెద్దపప్పూరు: కళింగర పంట సాగు చేసి నష్టపోయిన రైతుకు న్యాయం చేస్తామంటూ హెచ్‌ఓ ఉమాదేవి, ఏఓ మహిత భరోసా ఇచ్చారు. పెద్దపప్పూరు మండలం పసలూరు గ్రామానికి చెందిన రైతు మద్దా ప్రసాద్ 43 రోజుల క్రితం సాగు చేసిన కళింగర పంట ఎదుగుదల లేక నష్టపోయిన అంశంపై ‘విత్తన లోపమా.. ప్రకృతి శాపమా’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వారు స్పందించారు. బుధవారం ఉదయం పసలూరుకు చేరుకుని పంటను పరిశీలించారు. విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేసింది రైతు ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. పంట ఎదుగుదల లేదని నిర్ధారించి, ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించే వరకూ పంట తొలగించరాదని సూచించారు.
కుక్కల దాడిలో మేకల మృతి
గుమ్మఘట్ట: కుక్కల దాడిలో 12 మేకలు మృతిచెందాయి. గుమ్మఘట్ట మండలం కోనాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేకల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్న గ్రామానికి చెందిన ఓబులేసు తన వద్ద ఉన్న 25 మేకలను మంగళవారం రాత్రి గ్రామంలోని పాకలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత మందపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేస్తూ కుక్కలను అదిలించారు. అప్పటికే 12 మేకలు మృతి చెందాయి. ఘటనతో రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు.

వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్

వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్

వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్