
ద్విచక్ర వాహనాల ఢీ – మహిళ మృతి
పెద్దపప్పూరు: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(60) బుధవారం ఉదయం తన కుమారుడు రామాంజనేయులుతో కలసి పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. రామాంజనేయులుతో పాటు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు ఎర్రిస్వామికి గాయాలయ్యాయి. కాగా, నార్పల మండలం కేసేపల్లికి చెందిన ఎర్రిస్వామి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనపై ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జిల్లాకు 2,152 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: వివిధ కంపెనీల నుంచి 2,152 మెట్రిక్ టన్నుల ఎరువులు బుధవారం జిల్లాకు సరఫరా అయ్యాయి. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను రేక్ ఆఫీసర్, ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ పరిశీలించారు. కోరమాండల్ కంపెనీ నుంచి 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు 1,316 మెట్రిక్ టన్నులు, ఫ్యాక్ట్ కంపెనీ నుంచి 836 మెట్రిక్ టన్నుల అమ్మోనియం సల్ఫేట్ వచ్చిందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్‌ఎస్‌కేలు, సొసైటీలు, ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు సరఫరా చేయడంతో పాటు మిగిలినవి కంపెనీ గోదాముల్లో నిల్వ చేయనున్నట్లు తెలిపారు.
మట్కా బీటర్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: మండలంలోని చుక్కలూరు క్రాస్ వద్ద మట్కా రాస్తున్న ఇద్దరు బీటర్లను బుధవారం అరెస్ట్ చేసి, రూ.1,01,770 నగదు, పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ ధరణీబాబు తెలిపారు. పట్టుబడిన వారిలో కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన కాకర్ల రాఘవేంద్ర, కాకర్ల మల్లికార్జున ఉన్నారు. రెండు నెలల క్రితం చుక్కలూరు క్రాస్‌కు వలస వచ్చిన వీరు అక్కడే నివాసముంటున్నారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ టీ దుకాణం వద్ద మట్కా పట్టీలు చూసుకుంటున్న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్ర వాహనాల ఢీ – మహిళ మృతి