
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమపై కూటమి ప్రభుత్వానికి నిజంగా ప్రేమే ఉంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలి. రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లతో హంద్రీ–నీవా, గాలేరు నగరి, హెచ్‌ఎల్‌సీ తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తే 10 లక్షల ఎకరాలకు నీరివ్వవచ్చు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా సీమకు అన్యాయం జరిగిందంటూ కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడడం సరికాదు’ అని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తే ఎక్కడ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే అక్కసుతో సీఎం చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారన్నారు. రూ.81,900 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామంటున్నారని, కానీ కేవలం రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ రైతాంగానికి మేలు చేసినవారవుతారని హితవు పలికారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటే..దాన్ని తామే చేపడుతామని చంద్రబాబు తెచ్చుకున్నారన్నారు. తన హయాంలో దివంగత నేత వైఎస్సార్ కేంద్రాన్ని ఒప్పించి 45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం డ్యాం నిర్మించేలా అనుమతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ‘పోలవరం’ స్పిల్ వే పనులు పూర్తి చేశారన్నారు. డ్యాం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గిస్తూ కేంద్రం ఆమోదిస్తే.. అందుకు సీఎం చంద్రబాబు అంగీకరించి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. బనకచెర్ల–పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రతిపాదనలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును తప్పుబడుతూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ డైరెక్టర్ మల్లూజీ ఉపాధ్యాయ 14 పేజీల లేఖ రాశారన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారని, నిజంగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలనుకుంటే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసి న్యాయం చేయాలన్నారు. కేవలం మాటలకు పరిమితం కాకూడదన్నారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాలు చేయడానికి ప్రజలు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసాద్, దీపు, శివశంకర్, పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్