
సీమకు జరిగిన అన్యాయాన్ని మాటల్లో చెప్పలేం
అనంతపురం/టవర్‌క్లాక్: రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని మాటల్లో చెప్పలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అనంతపురంలో బుధవారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953లో కేవలం మూడేళ్లు రాజధానిగా కర్నూలు ఉందని, 1956లో రాజధానిని తరలించే క్రమంలో శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా రాయలసీమకు అనేక ప్రయోజనాలను చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. నేటికీ శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయకపోడం దురదృష్టకరమన్నారు. రాయలసీమ ప్రాంతంలోని అపరిష్కృత సమస్యలు, సీమ ప్రజల ఆలోచన, ఏంచేస్తే బాగుంటుందనే అంశాలను తెలుసుకునేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగిన రూట్‌మ్యాప్‌ను బీజేపీ రూపొందిస్తుందని తెలిపారు.
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే
లక్ష్యంగా పనిచేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మాధవ్ సూచించారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి బీజేపీ మరింతగా కృషిచేస్తుందన్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కిసాన్ రైలును అనంతపురం నుంచి ప్రారంభించిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. బీజేపీ చొరవతోనే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ ఏర్పాటైందన్నారు. రాబోవు రోజుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చరిత్రాత్మక ప్రదేశాల అభివృద్ధితో పాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామన్నారు. సంచార జాతుల పిల్లల చదువులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, మాజీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, అంకాల్‌రెడ్డి, చిరంజీవిరెడ్డి, రామచంద్రయ్య, ఫయాజ్ బాషా, లలిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్