
నమ్మకద్రోహులకు బుద్ధి చెప్పండి
గుంతకల్లు టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పడమే కాకుండా ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన నమ్మకద్రోహుల కూటమికి తగిన బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. బుధవారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన తిలక్‌నగర్ తదితర ఏరియాల్లో పర్యటించారు. ప్రతి నెలా విద్యుత్ బిల్లులు ఎంత మేరకు వస్తున్నాయని ప్రజలు, చిరు వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15,485 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గమన్నారు. స్మార్ట్ మీటర్లను బిగిస్తే వాటిని పగలగొట్టాలని యువగళం పాదయాత్రలో పిలుపునిచ్చిన నారా లోకేష్.. ఇప్పుడు మాట తప్పాడని విమర్శించారు. రానున్న రోజుల్లో విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల నిలువుదోపిడీని ఆపాలని, ప్రమాదకర స్మార్ట్‌మీటర్లు రద్దు చేయాలని, ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించరాదని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లుల భారాల్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న గుంతకల్లులోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, రమేష్, రంగమ్మ, చంద్ర, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్