
హవ్వ.. మరీ ఇంత బరితెగింపా!
రాప్తాడురూరల్: ఎక్కడైనా మట్టిరోడ్లు వేయాలంటే కొండ, గుట్టల నుంచి ఎర్రమట్టి తీసుకొస్తారు. అయితే అనంతపురం రూరల్ మండలానికి చెందిన కొందరు ‘తెలుగు తమ్ముళ్లు’ గతంలో వేసిన రోడ్లను చెరబట్టి అక్కడి మట్టిని తోలుతున్నారు. ఇంకా కొందరు మరింత బరి తెగించి ప్రైవేట్ స్థలాలకు మట్టిని తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ అసలు కథ..
అనంతపురం నగరంలో ఇంటిస్థలాలు లేని నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో అనంత పురం రూరల్ మండలం కామారుపల్లి పంచాయతీలో 160 ఎకరాల్లో జగనన్న లేఅవుట్ వేశారు. 7,384 మందికి పాట్లు కేటాయించి పట్టాలిచ్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కాలనీని అభివృద్ధి చేశారు. రూ. 80 లక్షల నిధులతోమట్టిరోడ్లు వేశారు. ప్రతి ప్లాటుకు హద్దులు కేటాయిస్తూ రాళ్లు నాటారు.
మట్టి కొట్టుకుపోతున్నారు..
కూటమి ప్రభుత్వం వచ్చాక కామారుపల్లి జగనన్న కాలనీపై టీడీపీ నాయకులు కన్నేశారు. కాలనీ అంతర్గత రోడ్లను ధ్వంసం చేస్తున్నారు. ఎర్రమట్టిని ట్రాక్టర్లలో నింపుకుని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 30 శాతం రోడ్లను ధ్వంసం చేశారు. కొందరు ప్రైవేట్ ప్లాట్లకు ఉపయోగించుకుంటుండగా, మరికొందరు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు వినియోగిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి తోలుకోవాలంటే రవాణా ఖర్చు అవుతుందని జగనన్న లేఅవుట్‌లోని రోడ్లను చిదిమేస్తున్నారు. రూరల్ మండలంలోని కామారుపల్లి, చిన్నంపల్లి, సజ్జకాలువ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న రోడ్లకు ఇదే మట్టిని తోలుకున్నట్లు తెలిసింది. అలాగే ప్లాట్లకు హద్దులు కేటాయిస్తూ నాటిన రాళ్లను సైతం ఎత్తుకెళ్లారు. ఇప్పటికే 30 శాతం పైగా రాళ్లు చోరీకి గురయ్యాయి.
పట్టపగలే బరి తెగింపు...
కామారుపల్లి జగనన్న లేఅవుట్ నుంచి పట్టపగలే బరి తెగించి ట్రాక్టర్లలో మట్టి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు ఉంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోకపోతే ‘తమ్ముళ్ల’ ధన దాహానికి ఉన్న రోడ్లన్నీ కర్పూర హారతిలా కరిగిపోనున్నాయి. నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి, వారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ కొందరు సాగిస్తున్న దందాపై సామాన్య ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలూ మండిపడుతున్నారు.
కామారుపల్లి జగనన్న కాలనీని చెరబట్టిన ‘తమ్ముళ్లు’
అంతర్గత రోడ్లలో
పట్టపగలే మట్టి దొంగతనం

హవ్వ.. మరీ ఇంత బరితెగింపా!