
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి.
మళ్లీ బురిడీ కొట్టించేందుకు వచ్చి.. కాళ్లకు బుద్ధిచెప్పి!
పామిడి: రైతు సభ్యత్వ కార్డు పేరుతో మరోసారి బురిడీ కొట్టించేందుకు వచ్చిన ఇద్దరు మోసగాళ్లు.. స్థానికులు తిరగబడడంతో కాళ్లకు బుద్ధి చెప్పారు. వివరాలు.. ప్రధాని మోదీ స్కీమ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేస్తోందని, ఇందుకు రైతు సభ్యత్వ కార్డు తీసుకోవాలంటూ ఐదు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు (వీరిలో ఒకరు మహిళ) పామిడి పంచాయతీలోని మజారా గ్రామమైన పి.కొత్తపల్లికి చేరుకుని రైతులతో సమావేశమై మాట్లాడారు. ప్రధాని స్కీమ్ అంటూ నమ్మబలకడంతో దాదాపు 500 మంది రైతులు ఒక్కొక్కరు రూ.200 చొప్పున చెల్లించి సభ్యత్వ కార్డులు పొందారు. తమ ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ ఖాతాకు అనుసంధానమైన సెల్‌ఫోన్ నంబర్ అందజేశారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ రైతు అనుమానం వచ్చి నిలదీయగా మోసగాళ్లు ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. ఇదే క్రమంలో మళ్లీ మంగళవారం మండలంలోని పీ కొత్తపల్లి గ్రామానికి మోసగాళ్లు రావడం గమనార్హం. అయితే, కంత్రీగాళ్లపై స్థానికులు తిరగబడడంతో భయాందోళనకు గురైన వారు తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పరుగు లంకించారు. జనం అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని యత్నిస్తున్న ఇలాంటి వారికి అధికారులు, పోలీసులు తగిన బుద్ధి చెప్పాలని మండలవాసులు కోరుతున్నారు.
జర్మన్ భాషపై శిక్షణ
అనంతపురం రూరల్: నర్సింగ్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థినులకు ఏపీ స్టేట్ స్కిల్ డెలప్‌మెంట్ ఆధ్వర్యంలో జర్మన్ భాషపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాసరావు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన గిరిజన విద్యార్థినులు https://naipunyam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారికి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో 8 నుంచి 10 నెలల పాటు జర్మనీ భాషపై శిక్షణ ఇస్తారు.