
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
అనంతపురం: శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేసింది. పలు డిమాండ్లను నెరవేర్చాలంటూ అనంతపురం అడ్వొకేట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సి. హనుమన్న ఆధ్వర్యంలో న్యాయవాదులు జిల్లా కోర్టు బయట సోమవారం ధర్నా చేపట్టారు. లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు గత 14 నెలలుగా లబ్ధి చేకూర్చలేదన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బార్‌కౌన్సిల్ ఆఫ్ ఏపీకి అందాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలన్నారు. ధర్నాలో న్యాయవాదులు ఆర్.బాలాజీనాయక్, ఎం.కృష్ణప్ప, అజీజ్, ఎం.శ్రీనివాసులు, రేవతి, గంగాదేవి పాల్గొన్నారు. బహుజన యువసేన పార్టీ చంద్రశ్చర్ల హరి, బీఎస్పీ అధ్యక్షుడు అంపాపతి గోవిందు, హర్షవర్ధన్ రెడ్డి, రామలింగారెడ్డి (సీనియర్ న్యాయవాది), హ్యుమన్ రైట్స్ జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, న్యాయవాది నీరజ, జూటూరు సుధాకర్ రెడ్డి, రంగనాయకులు, సాకే నరేష్, లక్ష్మణ్, నారాయణరెడ్డి, అనంతపురం బార్ అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ విజయభాస్కర్, ఉమామహేశ్వరి తదితరులు సంఘీభావం తెలిపారు.
వీఆర్‌కు కదిరి టౌన్ సీఐ!
అనంతపురం: కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డిని వీఆర్‌కు పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. కదిరి టీడీపీలో రెండు గ్రూపులుండగా.. ఓ వర్గానికి సీఐ నారాయణరెడ్డి మద్దతుగా నిలుస్తూ.. మరో వర్గం వారిపై కేసులు బనాయిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సీఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అందడంతో పోలీసు ఉన్నతాధికారులు నారాయణరెడ్డిని వీఆర్‌కు పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.