
బదిలీ టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం డీఈఓ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు బోధనకంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందన్నారు. యోగాంధ్ర, మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం, శిక్షణ తరగతులు పేరుతో బోధనకు దూరం చేస్తున్నారన్నారు. ఇవి కాకుండా రోజూ ఏదో ఒక సమాచారం అడుగుతున్నారని, అత్యవసరమంటూ యాప్‌లలో అప్‌లోడ్ చేయాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. విద్యా కిట్ల పంపిణీ అప్‌లోడ్ చేయాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు. ఇవికాకుండా ఉపాధ్యాయులకు ఏ మాత్రం సంబంధంలేని పీ–4 వంటి కార్యక్రమాలను కూడా అప్పగిస్తున్నారన్నారు. యాప్‌ల భారం తగ్గిస్తామని చెబుతూనే ఒకే యాప్‌లో అనేక సమాచారాలు పెట్టమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు జరిగి నెలరోజులు గడచినా ఇప్పటికీ వేలాదిమంది ఉపాధ్యాయులు రిలీవింగ్‌కు నోచుకోలేదన్నారు. పేరుకు ఐదుగురు టీచర్లను ఇచ్చినా చాలా పాఠశాలల్లో ఇద్దరే పనిచేస్తున్నారన్నారు. వారిపై బోధనా భారం ఎక్కువగా ఉందన్నారు. బదిలీ అయిన టీచర్లకు జీతాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రమణయ్య, సరళ, సుబ్బరాయుడు, చంద్రమోహన్, నాగేంద్ర, శ్రీనివాసులు, ఆదిశేషయ్య, సుభాషిణి, శ్రీకాంత్, సంపత్ కుమార్ పాల్గొన్నారు.
టీచర్ల సమస్యలను
పట్టించుకోని ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రాయల్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు మాట్లాడారు. ముందుచూపు లేకుండా ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించడంతో బదిలీ అయిన టీచర్లకు నేటికీ జూన్ నెల జీతాలు రాలేదన్నారు. జూలై నెల జీతం కూడా క్లెయిమ్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇంటి అద్దెలు కట్టలేక నెలసరి ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారన్నారు. తక్షణమే జీతాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తదుపరి జరిగే నష్టాలకు ఉపాధ్యాయులనే బాధ్యులు చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సభ్యులు దేశాయి నాగరాజు, మోహన్‌రెడ్డి, భాస్కర్, నరేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సర్దార్ వలి పాల్గొన్నారు.
మచ్చా దత్తారెడ్డి
మెరుపు సెంచరీ
● ప్రాబబుల్స్ పోటీల్లో సత్తా
అనంతపురం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ వన్డే ఆంధ్రా జట్టు ఎంపిక కోసం నిర్వహిస్తున్న ప్రాబబుల్స్ పోటీల్లో అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి సత్తా చాటాడు. 60 బంతుల్లో 10 సిక్సర్లు, 11 ఫోర్లతో 127 పరుగులతో చెలరేగాడు. ప్రాబబుల్స్ పోటీలు విజయనగరంలో నిర్వహిస్తున్నారు. టీమ్–డీ, టీమ్– సీ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న టీమ్–డీ 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల భారీ స్కోరు చేసింది. (వర్షం కారణంగా మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు). మచ్చా దత్తారెడ్డి టీమ్–డీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమ్–సీ జట్టు 166 పరుగులు మాత్రమే చేసింది. టీమ్–డీ 94 పరుగులతో భారీ విజయం సాధించింది.

బదిలీ టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి

బదిలీ టీచర్లకు వెంటనే జీతాలు చెల్లించాలి