
లడ్డూలో నాణ్యత ఎంత?
బొమ్మనహాళ్: శ్రావణ మాసంలో శని, మంగళవారాల్లో నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ప్రసాదంగా లడ్డూలు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఇక్కడ బయటి ప్రాంతాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా తెప్పించిన లడ్డూలను ఎవరికి తోచినట్టు వారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారుల అండదండలతోనే ఇలా సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. శుచి–శుభ్రతతో రుచికరంగా తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ విక్రయాల కోసం ఆలయ అధికారులు దేవదాయ శాఖ అనుమతి తీసుకుని వేలం పాట నిర్వహించాలి. వేలం దక్కించుకున్న వారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు నాణ్యతను పరిశీలించిన తర్వాత లడ్డూలను విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా బయట నుంచి లడ్డూలు తెప్పించి భక్తులకు ప్రసాదం పేరుతో అమ్ముతున్నారు. రెండు చిన్న సైజు లడ్డూలు రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నారు. ప్రసాదంతో పాటు స్వామి ఫొటోలను ఎవరు పడితే వారు.. ఎంత పడితే అంత ధరలకు విక్రయిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి లడ్డూ ప్రసాద ప్రాశస్త్యం, పవిత్రతకు భంగం వాటిల్లకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
నేమకల్లులో అనధికారిక విక్రయాలు
ఇష్టమొచ్చిన ధరలతో
భక్తుల జేబులకు చిల్లు
పట్టించుకోని దేవదాయ శాఖ అధికారులు