
వ్యక్తిపై వేట కొడవలితో దాడి
గుంతకల్లు రూరల్: పొలం రస్తా వివాదంలో గుర్రబ్బాడు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తిపై శనివారం అదే గ్రామానికి చెందిన గోవిందు అతడి కుటుంబ సభ్యులు వేట కొడవలితో దాడి చేశారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గుర్రబ్బాడు గ్రామానికి చెందిన కదిరప్ప, ప్రమీలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు సుధీర్ పేరున నాలుగు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన బాలిరెడ్డి అనే రైతు వద్ద నుంచి 1.48 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. పక్క పొలం రైతు అయిన గోవిందుతో ఆరోజు నుంచి రస్తా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం కదిరప్ప భార్య ప్రమీలమ్మ, పెద్ద కుమారుడు సూర్యనంద, అతడి భార్య హేమలతలు వారి పొలంలో కందిపంట సాగు చేయడానికి వెళ్లారు. అప్పటికే పక్క పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న గోవిందు, అతడి భార్య రామాంజినమ్మ, కుమారులు రాజమోహన్, అజయ్‌కుమార్‌లు ‘మీ పొలానికి రస్తా లేదం’టూ వారిని అడ్డుకున్నారు. మాటామాటా పెరగడంతో గోవిందు అతడి కుమారులు ప్రమీలమ్మతోపాటు, కొడుకు, కోడలును కొట్టి ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న కదిరప్ప రెండో కుమారుడు మధు వారిని వెంటబెట్టుకొని మరోసారి పొలానికి వెళ్లాడు. రస్తా సమస్యపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మధుపై వేటకొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.