
సాయం చేయబోయి మృత్యువాత
● రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ దుర్మరణం
గార్లదిన్నె: తోటి డ్రైవర్ పడుతున్న ఇబ్బంది చూసి టైరు మార్చేందుకు సాయం చేయడానికి వెళ్లిన బొలెరో డ్రైవర్‌ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం సంజీవపురానికి చెందిన నరసింహులు (32) బొలెరో వాహనం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేడు. గురువారం కళ్యాణదుర్గం నుంచి బీరకాయల లోడ్‌తో హైదరాబాద్ మార్కెట్‌కు బయల్దేరాడు. శుక్రవారం అన్‌లోడ్ చేశాడు. అనంతరం ఎరువులు లోడ్ చేసుకుని కర్నూలు జిల్లా బేతంచెర్లకు వస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున కోదండపూర్ సమీపంలోకి రాగానే అప్పటికే అక్కడ మరొక బొలెరో వాహనం టైరు పంక్చర్ అవడంతో రోడ్డు పక్కన ఆపారు. టైరు మార్చేందుకు డ్రైవర్ ఇబ్బంది పడుతుంటే నరసింహులు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఐషర్ వాహనం ఢీకొనడంతో నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.