
గుప్త నిధుల ముఠా అరెస్ట్
గుంతకల్లు రూరల్: మండలంలోని నాగసముద్రం గ్రామ సమీపంలో ఉన్న కొండపై వెలసిన చౌడమ్మ ఆలయం వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, తవ్వకాల్లో బయటపడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ప్రొబేషనరీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ తెలిపారు. గుంతకల్లు రూరల్ పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ రాఘవేంద్రప్పతో కలసి వివరాలను ఆయన వెల్లడించారు.
పథకం ప్రకారం తవ్వకాలు..
నాగసముద్రం కొండపై వెలసిన చౌడమ్మ ఆలయం సమీపంలో గుప్త నిధులు వెలికి తీసేందుకు నాగసముద్రం గ్రామానికి చెందిన ఇద్దరు, వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామానికి చెందిన రాము, కమలపాడు గ్రామానికి చెందిన బురుజుల బోయ శ్రీనివాసులు, గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డులో నివాసముంటున్న మేకల దేవేంద్ర, పామిడి మండలం గజరాంపల్లికి చెందిన జె.పరశురాముడు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలోని శంషాబాద్ మండలం బహుదూర్‌గూడ ప్రాంతానికి చెందిన పసుపుల మహీందర్, వికారాబాద్ జిల్లా, పరిగి మండలం రూపాన్‌పేట్ గ్రామానికి చెందిన ఇరికల వెంకటేశులు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి చెందిన మాడ మహేందర్, నారాయణపేట జిల్లా కోసిగి మండలం బిజ్జారం గ్రామానికి చెందిన భట్టగిరి అంజులయ్య, రంగారెడ్డి జిల్లా బోరబండ గ్రామానికి చెందిన ముద్దనూరి సురేంద్రతో కలసి పథకం రచించారు. ఇందులో భాగంగా ఈ నెల 24న గుప్త నిధుల తవ్వకాలకు అవసరమైన పరికరాలతోపాటు, నిధి నిక్షేపాలను గుర్తించే మెటల్ డిటెక్టర్‌లను సైతం గుంతకల్లులోని బోయ శ్రీనివాసులుకు చెందిన ఏపీ02 టీబీ 2351 నంబర్ ఉన్న అప్పీ ఆటోలో నాగసముద్రం కొండపైకి తరలించారు. మరికొందరు ఏపీ 09 బీసీ 3031 నంబర్ గల ఇన్నోవా కారులో కొండపైకి చేరుకున్నారు. మెటల్ డిటెక్టర్ సాయంతో నిధి నిక్షేపాల కోసం గాలించిన ముఠా సభ్యులు ఓ చోట తవ్వకాలను ప్రారంభించారు.
బయటపడిన నాగ పడిగ ప్రతిమ..
కొండపై అనుమానితుల సంచారాన్ని పసిగట్టిన నాగసముద్రం గ్రామస్తుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు, గ్రామ పెద్దలతో కలసి గురువారం కొండపైకి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన ఇద్దరు అక్కడి నుంచి పారిపోగా, మిగిలిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో గుప్త నిధులు వెలికి తీస్తున్నట్లుగా వారు అంగీకరించారు. అప్పటి వరకూ తవ్వకాల్లో బయటపడిన వస్తువులను పోలీసులకు చూపారు. అందులో ఓ మట్టి కుండలో 8 సీసపు గోలీలు, సీసపు కడ్డీలు, పురాతన కాలానికి చెందిన రెండు చిన్న ఉంగరాలు, నాగ పడగ కలిగిన ప్రతిమ, చతురస్రాకారంలో ఉన్న ఒక మట్టి ప్రతిమ ఉన్నాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారైన వారిలో నాగసముద్రం గ్రామానికి చెందిన సూరి, నారాయణస్వామి ఉన్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తవ్వకాల్లో వెలికి తీసిన వస్తువుల స్వాధీనం