
జల చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు
కణేకల్లు: హెచ్చెల్సీ నీటిని చౌర్యం చేస్తే చర్యలు తప్పవని నాన్ ఆయకట్టుదారులను కణేకల్లు హెచ్చెల్సీ సబ్‌డివిజన్ డీఈఈ దివాకర్‌రెడ్డి హెచ్చరించారు. కణేకల్లు, బొమ్మనహళ్ మండలాల్లోని హెచ్చెల్సీపై శుక్రవారం ఏఈఈలు నరేంద్రమారుతి, అల్తాఫ్‌తో కలసి ఆయన పర్యటించారు. కాలువ గట్టు ఇరువైపులా నాన్ ఆయకట్టుదారులు మోటార్లు, పైపులు వేసి జల చౌర్యానికి పాల్పడుతున్న తీరును గుర్తించి దాదాపు 40 చోట్ల పైపులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో డీఈఈ మాట్లాడుతూ.. హెచ్చెల్సీ ఆయకట్టు రైతులకు సాగు నీరందించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. నీటిచౌర్యాన్ని కట్టడి చేయడానికి నిరంతరం హెచ్చెల్సీపై గస్తీలు నిర్వహిస్తామన్నారు. మోటార్లు వేయడం, పైపుల ద్వారా నీటిని తోడటం లాంటివి చేస్తే ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తామన్నారు.
నేటి నుంచి నిస్సహాయులకు ఇంటి వద్దే రేషన్
అనంతపురం, అర్బన్: వయసు 65 ఏళ్లుపైబడిన వారికి, దివ్యాంగులు, నిస్సహాయులకు శనివారం నుంచి ఇళ్ల వద్దకే డీలర్లు వెళ్లి రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి పౌర సరఫరాలు, విజిలెన్స్, తూనికలు కొలతల శాఖల అధికారులు, తహసీల్దార్లు, సీఎస్‌డీటీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయుల ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులను ఈ నెల 30లోగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చౌక ధరల దుకాణాల రెన్యూవల్, కార్డుల్లో సభ్యుల తొలగింపు, ఆధార్ సీడింగ్‌లో తప్పులు సరిజేత, బియ్యం కార్డు అప్పగింత, కార్డుల విభజన, ఈ–కేవైసీకి సంబంధించి పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా చౌక ధరల దుకాణాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం రమష్‌రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి, డీజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ శంకర్, డిప్యూటీ తహసీల్దారు శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.