
తహసీల్దార్ నిర్దయ.. వీధిన పడిన కుటుంబం
ఆత్మకూరు: మండల తహసీల్దార్ నిర్దయ.. ఓ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది. తహసీల్దార్ కార్యాలయ ప్రహరీకి అనుకుని షెడ్డు వేసుకుని ముగ్గురు చిన్నారుల అలనాపాలన చూసుకుంటున్న వృద్ధురాలి పట్ల కఠినత్వాన్ని చూపుతూ అధికారులు షెడ్డును కూల్చేశారు. వివరాలు.. తల్లి మృతితో ముగ్గురు చిన్నారుల పోషణ భారం ఆత్మకూరులో నివాసముంటున్న వృద్ధురాలు గిరిజమ్మ (చిన్నారులకు అమ్మమ్మ)పై పడింది. అల్లుడు మద్యానికి బానిసై జులాయిగా మారాడు. దీంతో తనకు వచ్చే పింఛన్‌తోనే పిల్లల ఆలనాపాలన చూసుకుంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. తనకు ఇల్లు లేకపోవడంతో ఎలాగైనా సాయం చేయాలని నెల రోజుల క్రితం తహసీల్దార్ లక్ష్మీనాయక్‌ను కలసి వేడుకుంది. దీంతో అప్పట్లో సానుకూలంగా స్పందించిన తహసీల్దార్... తన కార్యాలయం పక్కన ప్రహరీని అనుకుని షెడ్డు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో గిరిజమ్మ అప్పు చేసి బండలు పాతుకుని రేకుల షెడ్డు వేసుకుంది. శుక్రవారం ఉన్నఫలంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అక్కడకు చేరుకుని షెడ్డును తొలగించారు. పిల్లలు అన్నం తింటున్నారని కాస్త సమయం ఇవ్వాలని వృద్ధురాలు వేడుకున్నా వినలేదు. తహసీల్దార్ చెప్పారంటూ ఇంట్లోని సామగ్రిని బయటకు విసిరేశారు. రేకులను తొలగించి పక్కన వేశారు. దీంతో కన్నీటి పర్యంతమైన వృద్ధురాలిని చూసి స్థానికులు కొందరు తహసీల్దార్‌ను నేరుగా కలసి నిలదీశారు. దీంతో తప్పు సరిదిద్దుకుంటానని, ఆ ముగ్గురు పిల్లలను తానే దత్తతకు తీసుకుంటానని భరోసానిచ్చారు. రెండు సెంట్ల స్థలం కేటాయించి, అందులో షెడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు అప్పటి వరకూ అద్దె ఇంట్లో ఉండే ఖర్చునూ భరిస్తానని హామీనిచ్చారు.