
జిల్లా రైతులను ఆదుకోవాలి : సీపీఎం
అనంతపురం అర్బన్: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3.40 లక్షల హెక్టార్లలో పంటల సాగు కావాల్సి ఉండగా... ఇందులో కేవలం 70 వేలు హెక్టార్లలో మాత్రమే సాగైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయన్నారు. జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో ఇప్పటికే సాగైన పంటలు ఎండిపోయేపరిస్థితి నెలకొందన్నారు. యాడికి, పెద్దవడుగూరు మండలాల్లో వేసిన పత్తి పంట వర్షాభావం కారణంగా ఎదుగుదల లేకపోవడంతో రైతులు తొలగిస్తున్నారన్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి నష్టపోయారన్నారు. వర్షం కురిస్తే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు పరిహారం, పంటల బీమా, ఎన్నికల హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు తక్షణమే ప్రతి రైతుకూ చెల్లించి ఆదుకోవాలన్నారు. సమావేశంలో కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, నాగేంద్రకుమార్, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.